
‘డబ్బు మా సెడ్డది. అది ప్రాణాలు పోస్తుంది.. అదే సమయంలో ప్రాణాలు తీస్తుంది. విజయవాడ వ్యాపారవేత్త రాహుల్ హత్య కేసులో మిస్టరీ వీడింది. డబ్బుల పంచాయితీయే ఈ హత్యకు ప్రధాన కారణంగా తేలింది. రాహుల్ తన భాగస్వాములకు డబ్బులు ఇవ్వకపోవడం.. ఏకంగా రూ.6 కోట్లు అప్పు తీసుకొని మరీ వారిని సతాయించడమే ప్రత్యర్థుల్లో ఆగ్రహానికి పురిగొల్పిందని.. అదే హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు.
విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు ఈ మేరకు కేసు వివరాలను వెల్లడించారు. విజయవాడ వ్యాపారవేత్త రాహుల్ ను హత్య చేసి చంపినట్లు తెలిపారు. రాహుల్ ను కారులో ఉన్న చార్జర్ వైరుతో హత్య చేశారని తెలిపారు. కారు వెనుక సీట్లో కూర్చుని రాహుల్ ను హత్య చేసినట్టు తెలిపారు. ఇదంతా డబ్బుల కోసమే జరిగినట్టుగా వివరించారు.
విజయవాడ వ్యాపారి రాహుల్ హత్య 18న సాయంత్రం జరిగింది. 19వ తేదీ ఉదయం కారులో డెడ్ బాడీ దొరికింది. కాల్ డేటా ఆధారంగా హత్యలో ఎవరు ఉన్నారో పోలీసులు కనిపెట్టారు. రాహుల్, కోరాడ విజయ్ కుమార్ లు వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నారు. వ్యాపారాల్లో కోరాడ విజయ్ కుమార్ తో రాహుల్ కు గొడవలు ఉన్నాయి. అలాగే చాగర్ల గాయత్రి అనే మహిళతో కలిసి కోరాడ చిట్స్ వ్యాపారం చేసాడు. ఇక కోరాడ గత ఎన్నికల్లో పోటీచేసి ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో అప్పుల వారు వెంటపడ్డారు. ఈ అప్పుల బాధ ఎక్కువ కావడంతో వారికున్న ఫ్యాక్టరీని విక్రయించి అప్పులు తీర్చాలని కోరాడ విజయ్ భావించాడు. తన పార్ట్ నర్ రాహుల్ పై ఫ్యాక్టరీ అమ్మాలని.. లేదా తన డబ్బులు తనకు ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చాడు.
అయితే రాహుల్ డబ్బులు ఇవ్వకుండా.. షేర్లు ట్రాన్స్ ఫర్ చేయకుండా మాటదాటేశాడు. దీంతో కోరా విజయ్ కుమార్ దీనిపై నేర ప్రవృత్తి గల కోగంటి సత్యంను ఆశ్రయించాడు. కోగంటి ద్వారా తన వాటా కోసం రాహుల్ పై ఒత్తిడి తెచ్చాడు.
ఇదే సమయంలో గాయత్రి కుమార్తెకు మెడికల్ సీటు ఇప్పిస్తానని రాహుల్ ఏకంగా రూ.6 కోట్లు తీసుకున్నాడు. ఆమెకు డబ్బులు ఇవ్వకుండా.. సీటు ఇప్పించకుండా రాహుల్ వేధిస్తున్నాడు.
18 రాత్రి 7.30 గంటలకు వివాదం సెటిల్ చేసుకుందాం అని రాహుల్ ను కోరాడ విజయ్, కోగంటి సత్యంలు పిలిచారు. పథకం ప్రకారం కొట్టి, మెడకు కారులో ఉచ్చు బిగించి చంపారు.
అంతకుముందు కోగంటి సత్యం సమక్షంలో డాక్యుమెట్ల పై సంతకాలు తీసుకున్నారు. రవికాంత్ అనే వ్యక్తి కోరాడ కు షల్టర్ ఇచ్చారు. మొత్తం 13 మంది నిందితులు ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్నారు. అందులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గాయత్రిని రాహుల్ మోసం చేసాడు. హత్యలో పాల్గొన్న వారికి ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంది.
కోగంటి దగ్గరుండి మరీ ఈ సంతకాలు తీసుకున్నాడు. తరువాత హత్య చేయమని కోగంటి తన మనుషులకు హుకూం జారీ చేశాడు.
కోగంటి సత్యంకు నేర చరిత్ర బాగా ఉంది. అతడిపై విజయవాడ నగరంలో 12 కేసులు ఉన్నాయి. ఈరోజు అరెస్ట్ చేసిన నిందితుల్లో A1 కోరాడ విజయ్ కుమార్, ఏ4 నల్లూరు రవికాంత్, ఏ6 కిలారి అనంత సత్యనారాయణ, ఏ8 పేక్ మహబూబ్, ఏ10 కఠారపు కోటేశ్వరరావు, ఏ11 కఠారపు గాంధి బాబులున్నారు.