
వైఎస్ షర్మిల కొత్త పార్టీపై తెలంగాణలో హాట్ హాట్ చర్చ సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించిన ఈమె ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు తోడుగా నడిచేందుకు ఇప్పటికే ఇతర పార్టీల నుంచి నాయకులు లోటస్ పౌండ్ కంపౌండ్ లోకి వెళ్లారు. మరికొందరు ఆమె వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి షర్మిల పార్టీలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
మొన్నటి వరకు ఆత్మీయ సమావేశాలకు పరిమితమైన షర్మిల మొదటి సారి సభలోకి వెళ్లనున్నారు. ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ లో శుక్రవారం సంకల్ప సభను నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు షర్మిల హాజరు కానున్నారు. అయితే లక్ష మందితో సభను నిర్వహించాలని అనుకున్నా.. కరోనా నేపథ్యంలో ఆరేవేల మంది తో సభను నిర్వహించుకోవచ్చని టీఎస్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో ఆమె శుక్రవారం లోటస్ పౌండ్ నుంచి 600 కార్లతో ఖమ్మం వెళ్లనున్నారు. ఈ సభకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, షర్మిల తల్లి విజయమ్మ హాజరుకానున్నారు. ఆమె వైసీపీకి గౌరవాధ్యక్షురాలిగా ఉన్నా సంకల్ప సభకు హాజరు కావడంపై చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన ఆత్మీయ సమావేశాల్లో ఇతర పార్టీలకు రాజీనామా చేసి షర్మిలతో నడుస్తామని ప్రకటించారు. ఇటీవల హైదరాబాద్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు షర్మిలతో సమావేశం అయిన విషయం తెలిసిందే. తాజాగా మరోకొంత మంది ప్రముఖులు షర్మిలతో కలుస్తారన్న చర్చ సాగుతోంది. వీరిలో సినీ నటి, మాజీ ఎంపీ, ప్రస్తుతం బీజేపీ నాయకురాలు విజయశాంతి పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె కమలం పార్టీలో కొనసాగుతున్నా ఆమె ఆసంతృప్తితోనే ఉన్నట్లు సమాచారం.
బీజేపీ తో రాజకీయ ప్రస్థానం సాగించిన విజయశాంతి ఆ తరువాత టీఆర్ఎస్ లోకి చేరారు. ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత తల్లితెలంగాణ పార్టీ పెట్టి రద్దు చేశారు. ఆ తరువాత కాంగ్రెస్ లో చేరినా.. ఆ పార్టీ అధికారంలో లేకపోయే సరికి.. కొన్ని నెలల కిందట ఆమె కాషాయం కండువా కప్పుకున్నారు. అయితే ఆమె పార్టీలో చేరినప్పటి నుంచి అడపాదడపా ప్రెస్ మీట్లలో కనిపించడమే కానీ ఎక్కడా ప్రత్యేకంగా నిలవడం లేదు. పైగా ఇటీవల జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతినడంతో అందరూ బీజీపీ పనైపోయిందని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు త్వరలో జరిగే ‘నాగార్జున సాగర్’ ఉప ఎన్నికలోనూ బీజేపీ గెలుస్తుందనే నమ్మకం లేదని కొందరు ఆ పార్టీ నాయకులు లోలోపల చర్చించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న షర్మిలను కలిసేందుకు పలువురు ప్రముఖులు లోటస్ పౌండ్ కు వెళుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఎంపీ కూడా షర్మిల పార్టీ పెడితే అందులోచేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో విజయశాంతి కూడా ఆమెతో నడిచేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అలాగే మాజీ మంత్రి కూడా షర్మిల పార్టీలో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారట. ఖమ్మంలో శుక్రవారం నిర్వహించే సభకు విజయశాంతి, ఆ మాజీ మంత్రి హాజరైతే వారు ఇక షర్మిల పార్టీలోకి వెళ్లినట్లేనని చర్చించుకుంటున్నారు.