
ఎక్కడైనా.. పంచాయతీ ఎన్నికల్లోనో.. పరిషత్ ఎన్నికల్లోనో ఏకగ్రీవాలు చేయాలని చూస్తుంటారు. కానీ.. విచిత్రంగా ఏపీలో ఓ కార్పొరేషన్ స్థానాలను విజయవంతంగా ఏకగ్రీవం చేయాలని చూస్తున్నారు అక్కడి అధికార పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. వైసీపీ ఉత్తరాంధ్ర బాధ్యతలు తీసుకున్న ఆయన ఇప్పుడు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీని గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇతర పార్టీల నేతలను సామ, బేద, దాన, దండోపాయాలు ప్రయోగించి పార్టీలోకి ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే నాలుగు డివిజన్ల టీడీపీ నేతల్ని పార్టీలో చేర్చుకున్నారు. ఇందులో ఒకరు ఇప్పుడు అభ్యర్థి కూడా. ఈ ఉత్సాహంలో ఆయన బీభత్సమైన స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు.
Also Read: టీటీడీ ఉద్యోగుల కల సాకారం : అందరికీ స్థలాలు
ఎన్నికలు జరిగేలోపు విశాఖలో మెజార్టీ కార్పొరేషన్లు ఏకగ్రీవాలు అవుతాయన్నట్లుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. విశాఖ విషయాన్ని విజయసాయిరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన తర్వాత స్వీప్ చేయాల్సిన బాధ్యతను జగన్ ఆయనకే ఇచ్చారు. అయితే.. పరిస్థితులు అంత గొప్పగా లేవు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కన్నా ఎక్కువగా సెంటిమెంట్‌గా మారింది. అదే సమయంలో విశాఖపట్నం సిటీలో టీడీపీ బలంగా ఉంది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులే గెలిచారు. అందులో ఒకరిని వైసీపీలోకి లాక్కో గలిగినా క్యాడర్ ఎంత వరకూ వెళ్తుందనే అనుమానాలు ఉన్నాయి. అందుకే విజయసాయిరెడ్డి ఏకగ్రీవాల సేఫ్ గేమ్ ప్రారంభించినట్లుగా భావిస్తున్నారు.
ఎన్నికలకు వెళ్లడం కన్నా ఏకగ్రీవాల ద్వారానే ఎక్కువ సీట్లు వైసీపీ ఖాతాలో వేయాలన్న లక్ష్యంతో విజయసాయిరెడ్డి ఉన్నట్లుగా కనిపిస్తోంది. కనీసం 20 కార్పొరేటర్ స్థానాలైపా ఏకగ్రీవం చేయగలిగితే.. మేయర్ పీఠం ఈజీ అవుతుందని ఆయన అంచనాతో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన తనదైన రాజకీయం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థులపై గురి పెట్టి.. ఇప్పటికే కొంత మందితో డీల్ సెట్ చేసుకున్నారని.. ఉపసంహరణ పత్రాలు తీసుకున్నారని అంటున్నారు. ఆ ధీమాతోనే ఎన్ని ఏకగ్రీవాలు అవుతాయో చూస్తారని అంటున్నారని విశ్లేషిస్తున్నారు.
Also Read: కుప్పంలో కుప్పకూలడానికి ఆ త్రిమూర్తులే కారణమట..? : ఫైర్ అయిన తమ్ముళ్లు
మరోవైపు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయడంలో విజయసాయిరెడ్డి పాత్ర కీలకమని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయనకు స్పెషల్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయని కూడా అంటున్నారు. ఇప్పుడు విశాఖలో పట్టు నిలుపుకోకపోతే.. హైకమాండ్ వద్ద ఆయన పరపతి పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే.. పాదయాత్రలతో పాటు మొత్తం బాధ్యత తనపై వేసుకుని పని చేస్తున్నారు. చివరకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో కొద్ది రోజులు ఆగితే కానీ అంచనా వేయలేం.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్