Vijayasai Reddy: అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగింది. చంద్రబాబు బినామీలు పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇవే ఆరోపణలు చేస్తూ మూడు రాజధానుల ఇష్యూను బయటకు తెచ్చారు. అంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇన్ సైడ్ ట్రేడింగ్ ఆరోపణలు రుజువు చేయలేకపోయారు. అయితే ఇప్పుడు విశాఖలో వైసీపీ నేతలు ఇన్ సైడ్ ట్రేడింగ్ చేసినట్టు పక్కా అవిడన్స్ బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీకీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబసభ్యులు భారీగా భూములు స్వాధీనం చేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రపోజుల్ ఏరియాల్లో ఎకరాలకు ఎకరాలు, వేల గజాలు లెక్కన విజయసాయిరెడ్డి కుటుంబసభ్యులు కొనుగోలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అటు దసపల్లా భూములను డెవలప్ మెంట్ చేయడానికి ముందుకొచ్చిన వారు విజయసాయి కుటుంబసభ్యుల ట్రస్ట్ లోపనిచేసిన వారేనని సాగరనగరంలో టాక్ నడుస్తోంది. అంటే అసలుసిసలైన ఇన్ సైడ్ ట్రేడింగ్ విజయసాయిరెడ్డి చూపించారన్న మాట. అందుకే ఆయన విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ కలవరిస్తున్నారన్న మాట. విశాఖ వాసులకు రాజధానిపై అంత మక్కువ లేకున్నా.. వైసీపీ నేతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నది ఇందుకేనన్న మాట.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విజయసాయిరెడ్డి విశాఖలో ఎంటరయ్యారు. ఆయనపై ఆరోపణలు వచ్చిన ప్రతీసారి ఆయన క్లారిటీ ఇస్తున్నారు. తనకు సెంటు భూమి ఉందని తేలినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. అంతటితో ఆగకుండా తనకు విశాఖలో స్థిర నివాసం ఏర్పాటుచేసుకోవాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టారు. అయితే విజయసాయిరెడ్డి వెంటే చాప కింద నీరులా అల్లుడు, కుమార్తె ఎంటరైపోయారు. అవ్యాన్ రియల్టర్స్ అనే సంస్థను సైతం ప్రారంభించారు. పవర్ పాలిట్రిక్స్ ప్రారంభించారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రపోజ్ ఏరియాలో భూములు కొనడం ప్రారంభించారు. ఇప్పటికే కొంత హస్తగతం చేసుకున్నారు. ఇంకా కొనుగోలు చేసే పనిలో ఉన్నారు. విశాఖలో వారానికి ఒక రిజిస్ట్రేషన్ జరిపిస్తున్నారు. తనకేమీ తెలియదు. తన జీవితం తెరిచిన పుస్తకమంటూ వేదాలు వల్లించే విజయసాయిరెడ్డి అసలు సిసలైన ఇన్ సైడ్ ట్రేడింగ్ విశాఖలో చూపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అటు విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్..ఇటు భోగాపురం విమానాశ్రయానికి టార్గెట్ చేసుకొని ప్రధాన రహదారి చెంతనే రూ.400 కోట్ల విలువైన భూములను అవ్యాన్ రియల్టర్ సంస్థ హస్తగతం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడే అసలు సిసలైన ఇన్ సైడ్ ట్రేడింగ్ వెలుగులోకి వచ్చింది. అటు తీరం వెంబడి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రపోజుల్ ఏరియా నుంచి భోగాపురం ఎయిర్ పోర్టును కలుపుతూ రహదారి ఎలైన్ మెంట్ ను ఏకంగా మార్చేశారు. విజయసాయి అల్లుడు, కుమార్తె కొనుగోలు చేసిన భూముల వెంబడి రహదారి ఉండేలా ఒత్తిడి చేసి సాధించారు. ఇది కదా అసలు సిసలైన ఇన్ సైడ్ ట్రేడింగ్. దసపల్లా భూములు కైవసం చేసుకున్న వారు విజయసాయి రెడ్డి బినామీలేనని ఆరోపణలున్నాయి. భూముల యజమానులతో డెవలప్ మెంట్ ఒప్పందం చేసుకున్న వారు విజయసాయి అల్లుడు, కూతురు కంపెనీల్లో డైరెక్టర్లు. వారే ఇప్పుడు దసపల్లా భూములను డెవలప్ చేసే బాధ్యత తీసుకున్నారు. అయితే ఉత్తరాంధ్రకు నేనే సీఎం అన్న రేంజ్ లో విజయసాయిరెడ్డి వ్యవహరించారు. ప్రస్తుతానికైతే విశాఖే..ఇంకా విజయనగరం, శ్రీకాకుళంలో ఎన్నెన్ని భూములు పోగేసుకున్నారోనన్న టాక్ నడుస్తోంది. ఇదంతా సీఎం జగన్ కు తెలియకుండా ఉంటుందా అని విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇన్నాళ్లు అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పుకొచ్చిన విజయసాయి మెడకే అవే ఆరోపణలు ఇప్పుడు చుట్టుకున్నాయి.