ఏపీ సీఎం వైఎస్ జగన్ టీడీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాల జాతరను వెలికి తీస్తున్నారు. వరుసగా ఒక్కో స్కాం బయటపడుతుంటే టీడీపీ మాజీ మంత్రుల పూసాలు కదిలిపోతున్నాయి. టీడీపీ నేతల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే టీడీపీ మాజీ మంత్రులంతా మౌనం దాల్చారు. అస్సలు యాక్టివ్ కావడం లేదు. ఫైర్ బ్రాండ్ దేవినేని ఉమ సైతం సైలెంట్ గా ఉండడం గమనార్హం.
ఇప్పటికే ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని విజయవంతంగా జైలుకు పంపిన వైసీపీ సర్కార్ తాజాగా అదే కేసులో మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణను బుక్ చేయడానికి సిద్ధమైంది. ఇక జేసీ ట్రావెల్స్ అక్రమాలపై ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలను జైలుకు పంపింది. ఈ నేపథ్యంలోనే నెక్ట్స్ ఏ మంత్రి బుక్కవుతారనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ బుక్కయ్యే మంత్రి ఎవరో పరోక్షంగా వెల్లడించారు. టీడీపీ శిభిరాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు.
రాష్ట్రానికి అప్పు ఇచ్చేది ఆ సంస్థేనా..!
తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో బాంబు పేల్చారు. టిడిపి ప్రభుత్వంలో పెద్ద కుంభకోణం జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కుంభకోణంలో ఓ మాజీ మంత్రి ఉన్నాడంటూ ఆయన పరోక్షంగా ఆరోపించారు. రూ.12 కోట్ల విలువైన సైకిళ్ల కుంభకోణం జరిగిందని లీకులు ఇచ్చారు.
విజయసాయిరెడ్డి తాజాగా ట్వీట్ చేస్తూ.. ‘తుప్పు సైకిళ్ళపై గంటా శీను గణగణా..! 12 కోట్ల కొనుగోళ్ళలో 5 కోట్ల అవినీతి! ఎస్ కే బైక్స్ నుంచి కొనవద్దని బ్లాక్ లిస్టు చేసినా.. బ్లాక్ మనీ కోసం తెగ తొక్కేశాడని ఫిర్యాదుల వెల్లువ..!’’అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
ఇక టీడీపీ నాయకుడి ఆట కూడా కట్టైందని విజయసాయిరెడ్డి సంచలన లీక్ చేశారు. 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి మళ్లీ ప్రభుత్వానికే విక్రయిస్తున్న ఆ టీడీపీ నాయకుడి పేరు ప్రపంచానికి త్వరలో పరిచయం చేయబోతున్నారు అంటూ బాంబు పేల్చారు.
ఇలా ప్రస్తుతానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు మరో టీడీపీ కబ్జా నేతకు మూడినట్టేనని వైసీపీ సర్కార్ లో నంబర్ 2 అయిన విజయసాయిరెడ్డి మాటలను బట్టి తెలుస్తోంది. నెక్ట్స్ గంటాకు గంట మోగడం ఖాయమనే ప్రచారం ఆయన చేసిన ట్వీట్ తో అర్థమవుతోంది.