
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ లో విజయమ్మ ఓ మీటింగ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ ఆత్మీయులుగా ఉన్నవారిని ఈ సభకు ఆహ్వానించారు. దాదాపు 350 మందిని ఈ సభకు పిలిచినట్టు సమాచారం. వీరందరికీ స్వయంగా విజయమ్మే ఫోన్ చేశారు. అయితే.. వాళ్లంతా ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎవరు వస్తారు? అనేది ఆసక్తిగా మారింది. సమావేశం ముగిసింది. ఇప్పుడు పోస్టుమార్టం మొదలైంది.
ఈ సభ రాజకీయాలకు అతీతమని, రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు అందరినీ ఆహ్వానిస్తున్నట్టు విజయమ్మ చెప్పుకొచ్చారు. అయితే.. ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతమని బయటకు చెబుతున్నప్పటికీ.. పక్కా పొలిటికల్ వ్యూహంతోనే ఏర్పాటు చేస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. తెలంగాణలో వైఎస్ కూతురు షర్మిల పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. కానీ.. ఆ పార్టీకి ఎలాంటి స్పందనా లేదు. షర్మిల ‘ఉనికి’ పాట్లు పడుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా.. మరోసారి షర్మిల పార్టీని చర్చలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారనే అభిప్రాయం వినిపించింది. వైఎస్ అభిమానులుగా ఉన్నవారిని షర్మిలకు దగ్గర చేసేందుకు చేసిన ప్రయత్నమే ఇదని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.
అయితే.. ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ నాయకత్వం.. మీటింగ్ ను బహిష్కరించింది. తెలంగాణతోపాటు ఏపీలోని కాంగ్రెస్ నేతలు కూడా ఇందులో పాల్గొనకూడదని పీసీసీలు ఉమ్మడిగా నిర్ణయించాయి. దీంతో.. దాదాపుగా ఎవ్వరూ రాలేదు. తెలంగాణ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం హాజరయ్యారు. తనకు పీసీసీ ఇవ్వకపోవడంతో గుర్రుగా ఉన్న కోమటిరెడ్డి.. షర్మిల పార్టీ ఆవిర్భావ సమావేశానికి కూడా తనకు ఆహ్వానం ఉందంటూ చెప్పారు. ఇప్పుడు ఈ సమావేశానికి కూడా హాజరయ్యారు. అటు ఏపీ నుంచి కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, ఉండవల్లి వంటివారు హాజరయ్యారు.
ఈ సమావేవానికి వైఎస్ కుమారుడు, ఏపీ సీఎం జగన్ హాజరు కాలేదు. దీంతో.. వైసీపీలో ఉన్న వారెవ్వరూ ఇక్కడ కనిపించలేదు. అంతేకాదు.. పలువురు సినీ నటులకు కూడా విజయమ్మ ఆహ్వానం పంపారు. చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు, కృష్ణ, జయసుధ వంటి వారిని పిలిచారు. కానీ.. వారు కూడా ఎవ్వరూ రాలేదు. ఇప్పుడు జగన్ తో సినీ ఇండస్ట్రీ సన్నిహితంగా ఉంటోంది. ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది. అందుకే.. ఎవ్వరూ రాలేదని అంటున్నారు. ఇక, తనకు ఇష్టం లేకుండా తన సోదరి తెలంగాణలో పార్టీ పెట్టిందని, అందుకే జగన్ ఆమెతో దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.
ఈ విధంగా.. కీలక నాయకులు ఒకరిద్దరు మినహా.. పెద్దగా కనిపించలేదు. ఇక, ఎందుకైతే ఈ సమావేశం పెట్టారని ముందు నుంచీ ప్రచారం జరిగిందో.. షర్మిల తన ప్రసంగంలో అదే చెప్పారు. హాజరైన నేతలు వైఎస్ తో తమ అనుబంధం చెప్పుకుంటే.. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ సమావేశాన్ని ముగించారు షర్మిల. పార్టీ ఆవిర్భావం తర్వాత ఒకటీ రెండు ప్రెస్ మీట్లు తప్ప.. షర్మిల పార్టీ చప్పుడు వినిపించలేదు. మళ్లీ ఈ మీటింగ్ ద్వారా ఒక చర్చ మాత్రం జరిగింది. మరి, రాజకీయంగా ఆమెకు ఈ సమావేశం ఎంత వరకు ఉపయోగ పడుతుందన్నది చూడాలి.