
Rain Alert: కరోనా లాక్ డౌన్ తో కాలుష్యం తగ్గి ప్రపంచంలో పర్యావరణం పరిరక్షించబడింది. ఈక్రమంలోనే క్రమతప్పకుండా వర్షాలు జోరుగా పడుతున్నాయి. మునుపు వానల కోసం కండ్లు కాయలు కాసేలా ఆకాశం వైపు ఎదురుచూసే వాళ్లం.. కానీ నేడు వద్దు వాన ముర్రో అని మొత్తుకుంటున్నా దంచికొడుతోంది. ప్రకృతిని బాగా చూసుకుంటే అది వానలు ఇతరత్రా రుతువుల రూపంలో టైం ప్రకారం వస్తుందని తేటతెల్లమైంది.
ఇప్పటికే వర్షాలతో తెలంగాణ, ఏపీల్లో జోరుగా వానలు పడుతున్న వేళ మరో హెచ్చరిక చేశారు వాతావరణ శాఖ అధికారులు. గురువారం బంగాళాఖాతంలో దక్షిణ ఆంధ్ర-ఉత్తర తమిళనాడు కోస్తా తీరంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపారు. ఇది పశ్చిమ మధ్య అనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 1.5 కి.మీ నుంచి 4.5 కి.మీల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈనెల 6న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణకు ముంచెత్తడం ఖాయమని అంటున్నారు.
తెలంగాణలో రానున్న 4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 6న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని.. ఆ తర్వాత అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే భారీ వర్షాలతో హైదరాబాద్ సగం మునిగింది. ఇప్పుడు రాబోయే వర్షాలతో ఇంకెంతటి ఉపద్రవం వస్తుందోనని హైదరాబాద్ వాసులు హడలి చస్తున్నారు.
ఇక ఏపీలోని ఉత్తరకోస్తా, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ.. రాబోయే మూడు రోజులు భారీ అతి భారీ వర్షాలు కురుస్తాయని.. సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు.