Vijay Sai Reddy: ఏపీలో అధికార వైసీపీలో సొంత నేతల మధ్యే విబేధాలున్నాయి. ఎప్పటి నుంచో ఉన్న ఈ విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా లోక్‌సభలో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే హోం మంత్రి అమిత్ షాకు ఏపీ ప్రభుత్వంపైన ఫిర్యాదు చేశారు. కాగా, తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం అమిత్ షాను కలిశారు. పలు విషయాలపై అమిత్ షాకు ఆయన వినతిపత్రం సమర్పించారు. వాటి గురించి తెలుసుకుందాం.

వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసి వైసీపీని ఇరకాటంలో పెట్టాలని రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చాలా కాలం నుంచి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే హోం మంత్రికి ఫిర్యాదు చేయగా, కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ సిద్ధమైంది. అందులో భాగంగానే ఎంపీ విజయసాయిరెడ్డి చాలా కాలం నుంచి కేంద్రమంత్రులను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆయనకు అప్పాయింట్‌మెంట్ దొరకడం లేదు. ఇటీవల పార్లమెంటు సమావేశాల సందర్భంగా పార్లమెంటులోని తన చాంబర్‌లో అమిత్ షా కాస్తంత తీరికగా ఉన్నారు. ఆ టైంలో రెండు నిమిషాలు సమయం ఇవ్వగా విజయసాయిరెడ్డి వెళ్లి పలు విషయాలపై ఆయనకు విన్నవించారు.
ఈ క్రమంలోనే హోం మంత్రికి వినతి పత్రం సమర్పించారు. అలా ఎట్టకేలకు కేంద్రమంత్రిని విజయసాయిరెడ్డి కలిశారు. విజయసాయిరెడ్డితో మిథున్ రెడ్డి ఉన్నారు. అయితే, ఏయే విషయాలపై కేంద్రమంత్రికి వినతి పత్రం ఇచ్చారనే విషయాలపై స్పష్టత రాలేదు. కానీ, రాష్ట్రానికి సంబంధించిన అంశాలయిన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు ఇతర విషయాలు అయి ఉండొచ్చని తెలుస్తోంది. అయితే, వారు రఘురామకృష్ణరాజుపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులు విచారణ వేగవంతం చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని కూడా కోరినట్లు సమాచారం. కేంద్రమంత్రి అమిత్ షాతో ప్రధానంగా రఘురామకృష్ణరాజుపై చర్యల గురించి ప్రధానంగా ప్రస్తావించి ఉండొచ్చని టాక్.
Also Read: AP Government employees: తప్పెవరిది?: ఏపీ ఉద్యోగులదా? జగన్ సర్కార్ దా?
రఘురామకృష్ణ రాజు చాలా కాలం నుంచి ఏపీలోని వైసీపీ ప్రభుత్వం, వైసీపీ అధినేత జగన్‌పైన బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబడుతూ ప్రతిపక్షం మాదిరిగా ప్రశ్నలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజు తీరు చూసి విసిగిపోయిన వైసీపీ నేతలు ఎలాగైనా అయనకు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కానీ, అది వారి వల్ల కావడం లేదు. దాంతో వారు కేంద్రప్రభుత్వ సహకారం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, రఘురామకృష్ణరాజు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సత్సంబంధాలున్నాయని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజు త్వరలో బీజేపీలో చేరుతారని వైసీపీ వాళ్లు ఆరోపిస్తున్నారు. చూడాలి మరి.. ఏమవుతుందో..
Also Read: AP Government: ఏపీ సర్కార్ చేసిన అప్పు ఎంతో తెలుసా?