TVK Vijay: పత్రికలు రకరకాలుగా రాస్తున్నాయి. చానల్స్ అనేక రకాలుగా వార్తలను ప్రచారం చేస్తున్నాయి.. ఇదే అదునగా కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ద్రావిడ సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. వాస్తవానికి జరుగుతున్న సన్నివేశం వేరు.. సాగిస్తున్న వ్యవహారం వేరు. కాకపోతే సందట్లో సడే మియా మాదిరిగా.. ఒక్కొకరు ఒక లెవల్లో పెర్ఫార్మన్స్ చేస్తున్నారు.
తమిళనాడులో టీవీకే పార్టీకి మాత్రమే అధికారాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇస్తానని ఇప్పటికే గవర్నర్ రెండు పర్యాయాలు చెప్పేశారు. మీ సంఖ్య బలాన్ని లోక్భవన్లో చూపించుకోవాలని.. మీకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కు సంబంధించిన ఎమ్మెల్యేల సంతకాలు తనకు కావాలని ఆయన స్పష్టంగానే చెప్పేశారు. కానీ సంఖ్యాబలాన్ని పెంపొందించుకోవడంలో విజయ్ ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి ఆయనకు ఈ రాజకీయాలు తెలియదు. ఎలాంటి వ్యవహారాలు సాగిస్తే అధికారం దక్కుతుందో కూడా ఆయనకు తెలియదు. ఏదో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతుంది. కాంగ్రెస్ సపోర్ట్ చేస్తామని చెబుతున్నప్పటికీ.. ఆ బలం విజయ్ పార్టీకి సరిపోదు. పైగా కమ్యూనిస్టులు కూడా రకరకాల షరతులు విధిస్తున్నారు. ఇలాంటప్పుడు విజయ్ ముఖ్యమంత్రి అవుతారా.. గవర్నర్ ను మెప్పిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఇలా సాగిపోతుంటే.. అర్జెంటుగా ఈ వ్యవహారానికి యాంటీ మోడీ పేరు పెట్టారు కొంతమంది సీనియర్ నటులు. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ప్రాంతాలలో ఓడిపోయిన ఫ్రస్టేషన్ కాంగ్రెస్ లో ఉండడంతో.. ఆ పార్టీ కూడా పల్లవి కలిపింది. ఇంకేముంది రాగం అందుకుంది. గవర్నర్ వ్యవస్థను తప్పు పట్టే విధంగా మాట్లాడింది. అంతేకాదు గవర్నర్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వానికి ఊడిగం చేసే విధంగా మారిపోయిందని మండిపడింది. ఆ కాడికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్లు ప్రజల పక్షంగా ఉన్నట్టు.. సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాంలాల్ అనే గవర్నర్ తో ఏం చేయించిందో ఇప్పటి కాంగ్రెస్ పెద్దలకు తెలియకపోవచ్చు. కానీ ఒక్కసారి పాత పత్రికలను తిరిగేస్తే ఈ విషయం మొత్తం తెలుస్తుంది. గవర్నర్ వ్యవస్థను బ్రష్టు పట్టించిన సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. కానీ ఆ పార్టీ ఇవాళ నీతులు చెబుతోంది. కనీసం ఎన్నికల్లో నిలబడలేని కమలహాసన్.. ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతున్నారు. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని ప్రకాష్ రాజ్ కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. ఇక్కడ గవర్నర్ ఏం చెప్పాడు.. విజయ్ ఏం చేస్తున్నాడు అనే విషయాలను పక్కనపెట్టి.. కేవలం కేంద్రానికి వ్యతిరేకంగా వ్యవహరించాలి అనే ధోరణితోనే ఈ వ్యక్తులు మాట్లాడుతున్నారు. చివరికి విశాల్ లాంటి నటుడు కూడా వీరితో స్వరం కలపడం విశేషం.
అన్నట్టు ద్రవిడ వాదాన్ని ఈసారి తమిళ ప్రజలు పట్టించుకోలేదు. ఎంతసేపటికి ఆ సోదిని తట్టుకోలేక ప్రజలు ఈసారి మార్పు కోరుకున్నారు. కాకపోతే విజయ్ పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. అలాంటప్పుడు ద్రావిడ వాదం మరుగున పడిపోతుందని కమల్ హాసన్ లాంటి నాయకులు మాట్లాడటం నిజంగా హాస్యాస్పదం. ఈ తరహా వారికి ప్రకాష్ రాజ్ ఇలాంటి స్థిరత్వం లేని వ్యక్తులు కూడా స్వరం కలపడం మరింత హాస్యాస్పదం. ఈ నటులంతా విజయ్ పోటీలో ఉన్నప్పుడు కనీసం సంఘీభావం చెప్పలేదు. సపోర్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు మాత్రం ఇల్లు కాలుతుంటే చుట్ట పీక వెలిగించుకోవడానికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుతున్న వీరంతా విజయ్ ని ఏం చేద్దాం అనుకుంటున్నారో..