జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కళ్యాణ్, ప్రజారాజ్యం మాజీ నేత పరకాల ప్రభాకర్ మధ్య రాజకీయ చిచ్చు రేగుతోంది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకునే స్థాయికి వెళ్లారు. సామాజిక మాధ్యమాల వేదికగా పరకాల ప్రభాకర్ పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా పోస్టులు పెట్టడంతో పవన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటుతో పరకాల తన సేవలు అందించిన విషయం విదితమే. కానీ ప్రస్తుతం ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత రీతిలో ఆగ్రహావేశాలు రగులుతున్నాయి.
పరకల చేసిన ట్వీట్లలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించినవిగా ఉన్నాయి. రెండో చోట్ల ఓడిన వాళ్లంటూ చురకలు వేయడంతో పవన్ అభిమానుల్లో కోపం పెరిగిపోతోంది. పరకాల జాగ్రత్త అంటూ హితోక్తులు విసురుతున్నారు. 2009లో కాంగ్రెసోల్లు పంచెలూడగొడతామంటూ బెదిరించినా కాంగ్రెస్ లో ఎందుకు చేరినట్లు అని మెగా బ్రదర్స్ ను సూటిగా చూపిస్తూ పోస్టులు చేయడంతో మెగా అభిమానుల్లో రక్తం ఉడుకుతోంది. దీంతో పరకాల ప్రభాకర్ పై వారు కూడా సమరీతిలో స్పందిస్తున్నారు.
2014లో టీడీపీలో చేరి ఆ పార్టీని ఎందుకు వీడినట్లు అని ప్రశ్నించారు. 2017లో పాచిపోయిన లడ్డూ అని విమర్శలు చేసి మళ్లీ కమలం పార్టీలో చేరి తామరపువ్వును చెవిలో ఎందుకు పెట్టుకున్నట్లు అని నిలదీశారు. భీమవరం, విశాఖలో ఏదో సాధిస్తామని చెప్పి ఇంతవరకు ఎందుకు సాధించలేదని విమర్శించారు. దీనిపై కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు దీటైన సమాధానం ఇస్తున్నారు. పరకాల ప్రభాకర్ అవాకులు చెవాకులు పేలితే జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా పరకాల వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. పరోక్షంగా ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. పరకాల చేసిన వరుస ట్వీట్లతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పరకాల ప్రభాకర్ తీరు మారకపోతే పరిణామాలు తీవ్రం గా ఉంటాయని చెబుతున్నారు. ఇన్నాళ్లు కుక్కిన పేనుగా ఉన్న పరకాల ఇప్పుడు ఎందుకు పేలుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బాబు ప్రభుత్వంలో పరకాల మీడియా సలహాదారుగా వ్యవహరించారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తరువాత పరకాల కూడా తన పదవికి రాజీనామా చేశారు. పరోక్ష విమర్శలు చేస్తున్న పరకాల తీరుపై జన సైనికులు హెచ్చరికలు జారీ చేశారు. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా చేస్తున్న పోస్టులన్ని వైరల్ అవుతున్నాయి. అయితే ఈ యుద్ధం ఇంతటితో ఆగుతుందా లేక ఇంకా రెచ్చిపోతారా అనే అనుమానాలు సగటు అభిమానిలో వ్యక్తమవుతోంది.