Venu Swamy: వెంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టుంది వేణు స్వామి పరిస్థితి. సినీ, రాజకీయ సెలబ్రిటీల జాతకం చెప్పేవేణు స్వామి చెప్పినవి చాలావరకు ఫలించాయి. ఆయన చెప్పిన మాదిరిగానే చాలామంది ఉన్నత పదవులు పొందగలిగారు. దీంతో వేణు స్వామి ఒక సెలబ్రిటీగా మారిపోయారు. ఆన్లైన్ జాతకుడిగా ముద్ర పడిపోయారు. ఆయన చెబితే అంతే అన్న రీతిలో ప్రచారం జరిగిపోయింది. అయితే కొద్ది నెలల కిందటే తెలంగాణ రాజకీయాల గురించి ఆయన మాట్లాడారు. ఫలానా వ్యక్తి తప్పకుండా సీఎం అవుతారని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు తెలంగాణ ఫలితాల్లో ఆయన చెప్పిన జాతకానికి విరుద్ధంగా జరుగుతోంది. దీంతో ఇప్పుడు అందరికంటే వేణు స్వామి టార్గెట్ అవుతున్నారు.
మంత్రాలకు చింతకాయలు రాలవంటారు. కానీ రాజకీయ మంత్రాలు చెప్పే వారికి మాత్రం చాలా విలువ ఉంటుంది. ఈ కోవలోకి చేరారు వేణు స్వామి. గతంలో ఆయన చెప్పిన జ్యోతిష్యం నిజమైంది. అందుకే కొద్ది రోజుల కిందట యూట్యూబ్ ఛానల్ లో తెలుగు రాష్ట్రాల భవితవ్యాన్ని వేణు స్వామి తేల్చి చెప్పారు. ఏపీలో జగన్, తెలంగాణలో కెసిఆర్ అధికారంలోకి రావడం ఖాయం అని తేల్చేశారు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ వాటితో వేలు స్వామి ఎక్కడ అన్న ప్రశ్న సోషల్ మీడియాలో కనిపిస్తోంది. కొందరైతే విపరీతమైన కామెంట్లతో వేణు స్వామిని ఓ రేంజ్ లో వేసుకోవడం విశేషం.
తెలంగాణ ఫలితాలు పుణ్యమా అని వేణు స్వామి జాతకం అమాంతం పడిపోయింది. ప్రస్తుతం ఆయన అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నారు. కెసిఆర్ జాతకం దేవుడేరుగు.. మీ జాతకం చెప్పండి వేణు స్వామి అంటూ నెటిజన్లు విభిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికైతే తెలంగాణ ఎన్నికల ఫలితాలు వేణు స్వామి జాతకాన్ని మార్చేశాయి. ఇకనుంచి జాతకాలు, జోస్యాలకు ఓట్లు పడే అవకాశం లేదని తెలంగాణ ప్రజలు తేల్చేశారు.