Dil Raju Varasudu Movie: చెడపకురా చెడేవు అన్న సామెత ఉండనే ఉంది. ఎవరినో ఏదో చేద్దాం అనుకుని చివరికి దిల్ రాజే బుక్ అయ్యాడు. నేడు విడుదలవుతున్న వారసుడు చిత్రంపై కనీస బజ్ లేదు. తెలుగు ఆడియన్స్ వారసుడు చిత్రం చూడాలన్న ఆసక్తి చూపించడం లేదు. యావరేజ్ టాక్ తెచ్చుకున్నా ఆ వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలకే మొగ్గు చూపిస్తున్నారు. ప్రతి విషయంలో చాలా పక్కాగా ఉండే దిల్ రాజు వారసుడు విషయంలో తడబడ్డాడని స్పష్టంగా అర్థం అవుతుంది. ఆయన పొరపాట్లతో వారసుడు చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో దెబ్బ పడింది అంటున్నారు.

ముఖ్యంగా ప్రమోషన్స్ సరిగా లేవు. వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న విజయ్ వారసుడు చిత్రం కోసం హైదరాబాద్ లో అడుగుపెట్టలేదు. ఇది దారుణ పరిణామం. చేసేది లేక దిల్ రాజు క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ తో ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో హీరో, హీరోయిన్ లేకపోతే ప్రచారం ఎక్కడి నుండి వస్తుంది. వారసుడు చిత్రాన్ని తెలుగులో ప్రమోట్ చేయడం విజయ్ కి కూడా అవసరం. పాన్ ఇండియా హ్యాంగ్ ఓవర్ లో ఉన్న హీరోలు ఇతర రాష్ట్రాల్లో మార్కెట్ విస్తరించుకోవాలి అనుకుంటున్నారు.
దేశంలోనే అతిపెద్ద సినిమా పరిశ్రమగా అవతరించిన టాలీవుడ్ ని నిర్లక్ష్యం చేయడం విజయ్ కే నష్టం. ఇక వారసుడు మూవీపై జనాల్లో ఆసక్తి పోవడానికి మరొక కారణం విడుదల తేదీ. కొత్త సినిమా ఫీలింగ్ తెలుగు ఆడియన్స్ లో పోయింది. కారణం… జనవరి 11న తమిళ వర్షన్ వారిసు విడుదలైంది. సినిమా కథ, కథనం, టాక్ బయటకొచ్చేశాయి. పైరసీ బొమ్మలు కూడా ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. దానికి తోడు సినిమాకు యావరేజ్ టాక్.

తమిళ వర్షన్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని ఉంటే వారసుడు చిత్రానికి ప్లస్ అయ్యేది. సినిమా బాగుందంట చూడాలని ఆడియన్స్ ఆసక్తి కనబరిచేవారు. వారిసు సోసోగా ఉందని తెలియగానే వారసుడు చిత్రాన్ని లైట్ తీసుకున్నారు. దిల్ రాజు ముందుగా అనుకున్నట్లు జనవరి 11న వారసుడు కూడా విడుదల చేస్తే హైప్ వేరుగా ఉండేది. సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కేవి. ట్రైలర్ తోనే నెగిటివిటీ మూటగట్టున వారసుడు చిత్రాన్ని లేటుగా విడుదల చేసి దిల్ రాజు నష్టపోయాడు. థియేటర్స్ లాక్ చేసిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలను ఇబ్బంది పెట్టాలని దిల్ రాజు చూశాడు. కానీ వారసుడు చిత్రాన్ని ఆయన జనవరి 14కి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. దాంతో ఆయనే నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.