Vangaveeti Radhakrishna : ఏపీ రాజకీయాల్లో కీలక అప్డేట్. వంగవీటి మోహన్ రంగ తనయుడు వంగవీటి రాధ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఇంతవరకు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో వంగవీటి రాధా పేరు లేదు. ఆయన విజయవాడ తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే రెండు చోట్ల టిడిపి తన అభ్యర్థులను ప్రకటించింది. దీంతో రాధాకు చాన్స్ లేకుండా పోయింది. కానీ ఆయన జనసేనలో చేరి టిక్కెట్ దక్కించుకుంటారని తాజాగా ప్రచారం జరుగుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిన నేపథ్యంలో.. వంగవీటి రాధాను జనసేనలోకి రప్పించాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం.
రంగా వారసుడిగా 2004లో రాధాకృష్ణ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రాధాకృష్ణ విజయం సాధించారు. కానీ 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ వైపు అడుగులు వేశారు. తూర్పు నియోజకవర్గం నుంచి పిఆర్పి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తరువాత వైసిపి ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో విజయవాడ సెంట్రల్ సీటును ఆశించారు. కానీ జగన్ మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయమని సూచించారు. దీంతో అసంతృప్తికి గురైన రాధా వైసీపీని వీడారు. తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడంతో సైలెంట్ అయ్యారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నా యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
అయితే గత కొంతకాలంగా ఆయన జనసేనలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. ఇటీవల నాదేండ్ల మనోహర్ తో పాటు వల్లభనేని బాలశౌరి లను కలవడం అనుమానాలకు బలం చేకూరింది. అయితే ఈ విషయంలో మరో అప్డేట్ బయటకు వచ్చింది. వంగవీటి రాధాకృష్ణ మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే ఈ పార్లమెంట్ స్థానం నుంచి వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తారని టాక్ నడిచింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాధాను ఎంపిక పోటీ చేయించడానికి పవన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందుకే అవనిగడ్డ సీటును పెండింగ్ లో పెట్టారని తెలుస్తోంది. ఒకవేళ రాధా ఎంపీగా పోటీ చేయడానికి ముందుకు రాకుంటే.. అవనిగడ్డ సీటు కేటాయించే అవకాశం ఉంది. ఎంపీగా రాధా పోటీ చేస్తే వల్లభనేని బాలశౌరి అవనిగడ్డ నుంచి బరిలో దిగే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది.