Vangaveeti Radha Krishna: ఏపీ పాలిటిక్స్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంగవీటి రాధాకృష్ణ. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. కానీ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. పెళ్లి ఎప్పుడు అని అడిగితే చిరునవ్వే సమాధానం అయ్యేది. ఇప్పుడు ఆయన పెళ్లి పీటలెక్కనున్నారు. ఒక ఇంటివాడు కాబోతున్నారు. రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్న వేళ.. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న వేళ.. ఆకస్మాత్తుగా వివాహ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వధువు ఎవరనేది ఆసక్తిగా మారింది. రాజకీయ కుటుంబానికి చెందిన యువతినే రాధా వివాహమాడనున్నట్లు తెలుస్తోంది.
ఎంగేజ్మెంట్ తో పాటువివాహాన్ని సైతం నెల రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. నరసాపురానికి చెందిన యువతితో రాధాకు వివాహం నిశ్చయమైంది. ఈనెల 19న నిశ్చితార్థం జరగనుంది. సెప్టెంబర్ 6న వివాహానికి ముహూర్తంగా నిర్ణయించారు. వివాహం విజయవాడలో కానీ బెంగళూరులో కానీ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకు అతి ముఖ్యమైన సన్నిహితులకు మాత్రమే రాధా తన వివాహం గురించి షేర్ చేసుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీకి రాధా సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన టిడిపిలో కొనసాగుతున్నారు. ఆ నియోజకవర్గంలో టిడిపి ఇన్చార్జిగా బోండా ఉమా ఉన్నారు. దీంతో టీడీపీలో కొనసాగాలా? జనసేనలో చేరాలా? అన్న సందిగ్ధంలో రాధా ఉన్నారు. ఈ తరుణంలో నరసాపురం మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కుమార్తెతో రాధాకు వివాహం నిశ్చయమైంది. పెళ్లికి అభిమానులందరినీ ఆహ్వానించి గ్రాండ్ గా చేస్తారా? లేదా కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఏపీ పాలిటిక్స్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న వంగవీటి రాధాకృష్ణ ఒక ఇంటివాడు కాబోతున్నాడు.