Vanama Venkateshwara Rao
Vanama Venkateshwara Rao: తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు ఇచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత విధిస్తూ తీర్పు ఇచ్చింది. 2018 ఎన్నికల్లో ఆయన తప్పుడు అఫిడవిట్ ఇచ్చారనే అభియోగాలు ఉన్నాయి. దీంతో ఆయన సమీప ప్రత్యర్థి, అప్పటి భారత రాష్ట్ర సమితి అభ్యర్థి జలగం వెంకట్రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. దీంతో ఈ కేసును విచారించిన హైకోర్టు మంగళవారం పై విధంగా తీర్పు ఇచ్చింది.. అంతేకాకుండా ఆయనకు ఐదు లక్షల జరిమానా కూడా విధించింది. ఎన్నికల్లో జలగం వెంకట్రావు విజేత అని, 2018 డిసెంబర్ 12 నుంచి ఆయనే ఎమ్మెల్యే అని ప్రకటించింది.
మొదటినుంచి అనుమానాస్పద ధోరణి
వనమా వెంకటేశ్వరరావు ది మొదటి నుంచి కూడా అనుమానాస్పద ధోరణే. చిన్న స్థాయి నుంచి మంత్రి దాకా ఎదిగినప్పటికీ ఆయన తనకు అవసరం అనుకుంటే ఏదైనా చేస్తారని పేరు ఉంది.. పైగా ఆస్తులు కూడా బాగానే కూడా పెట్టారని ప్రచారం జరుగుతున్నది. ఇక వనమా వెంకటేశ్వరరావు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఫామ్ తెచ్చుకున్నారు. ఇవే నాకు చివరి ఎన్నికలంటూ ప్రచారం చేశారు. దీంతో జనాల్లో సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. తన సమీప ప్రత్యర్థి జలగం వెంకట్రావు మీద గెలిచారు. అయితే వనమా వెంకటేశ్వరరావు ప్రకటించిన ఎన్నికల అఫిడవిట్లో మొత్తం తప్పులు ఉన్నాయని, ఆస్తులకు సంబంధించిన వివరాలను తప్పుగా ప్రకటించాలని వెంకటరావు ఆరోపించారు. ఆరోపించడం మాత్రమే కాకుండా ఏకంగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఎప్పుడైతే జలగం వెంకట్రావు సుప్రీంకోర్టుకు వెళ్లారో.. అప్పుడే వనమా వెంకటేశ్వరరావు తెలివిగా భారత రాష్ట్ర సమితిలో చేరారు. భారత రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత జలగం వెంకట్రావు కొత్తగూడెం నియోజకవర్గంలో అడుగుపెట్టకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ తో చెప్పించారు. కేసు ను కూడా విత్ డ్రా చేసుకోవాలని ఆయన ద్వారా చెప్పించేలా చేశారు. అయితే దీనికి ఒప్పుకోని జలగం వెంకట్రావు కేసు విషయంలో ముందుకే వెళ్లారు.
సుదీర్ఘకాలం విచారణ
2019లో సుప్రీంకోర్టు తలుపు తట్టిన జలగం వెంకట్రావు.. ఈ కేసు విషయంలో ఎక్కడా కూడా వెనక్కు తగ్గలేదు. పైగా న్యాయపరంగా అనేక ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించారు. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు బదలాయించింది. అయితే వనమా వెంకటేశ్వరరావు తనకున్న రాజకీయ బలం ద్వారా ఆ కేసును పలుమార్లు వాయిదా వేయించుకున్నప్పటికీ చివరికి న్యాయం గెలిచింది. ఎన్నికల అఫిడవిట్ లో వెంకటేశ్వరరావు తప్పుడు వివరాలు సమర్పించారని హైకోర్టు భావిస్తూ ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడంటూ పేర్కొన్నది.. అంతేకాకుండా ఐదు లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఒక్కసారిగా కొత్తగూడెం నియోజకవర్గంలో కలకలం చెలరేగింది. హైకోర్టు తీర్పుతో వనమా వర్గంలో నైరాశ్యం అలముకుంది.