
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు మరోసారి చర్చల్లోకి వచ్చింది. ఆ మధ్య నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా అంటూ చిరంజీవి ‘సైరా’ సినిమాను రూపొందించారు. తాజాగా.. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి రాష్ట్ర ప్రభుత్వం నరసింహారెడ్డి పేరు పెట్టడంతో మరోసారి ఆ పేరు వార్తల్లో నిలిచింది. అయితే.. కొందరు తొలి స్వాతంత్ర సమరయోధుడిగా ఆయనను కీర్తిస్తుంటే.. మరికొందరు మాత్రం కేవలం పాలెగాడిగా తనకు దక్కాల్సిన వాటా కోసమే పోరాటం చేశారని అంటున్నారు. మరి, ఈ రెండు కోణాల విశ్లేషణ ఎలా ఉందన్నది చూద్దాం.
కర్నూలు జిల్లాలోని ప్రస్తుత ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉన్న ఉయ్యాలవాడ ప్రాంతానికి నరసింహారెడ్డి పాలెగాడిగా ఉన్నారు. అసలు ఈ పాలెగాళ్లు ఎవరు అంటే.. విజయనగర సామ్రాజ్యం క్షీణించిన తర్వాత ఆ రాజ్యంలోని ప్రాంతాలన్నీ ముక్కలు చెక్కలుగా కొందరి పాలనలోకి వెళ్లిపోయాయి. ఆ తర్వాత టిప్పు సుల్తాన్ ఆధ్వర్యంలోకి వచ్చాయి. ఆయన మరణం తర్వాత 1800 సంవత్సరంలో నిజాం రాజుల పాలనలోంచి బ్రిటీష్ వారి ఆధీనంలోకి రాయలసీమ ప్రాంతాలు వెళ్లాయని చరిత్ర చెబుతోంది. ఈ వివరాలన్నీ తంగిరాల వెంకట సుబ్బారావు రచించిన ‘రేనాటి సూర్యచంద్రులు’ పుస్తకంలో ఉన్నాయి. ఇంకా చాలామంది వాగ్గేయకారులు పలు వివరాలను గ్రంథస్తం చేశారు.
పాలెగాళ్ల పని ఎలా ఉండేదంటే.. రాజు కింద సామంతులు ఉండేవారు. వీరు రాజ్యంలోని పెద్ద ప్రాంతాలకు అధిపతులుగా ఉండేవారు. వీరి కింద అమర నాయకులు అని ఉండేవారు. మరింత చిన్న ప్రాంతాల వీరి ఆధీనంలో ఉండేవి. వీరి కింద ఉండే పల్లె ప్రాంతాలపై అజమాయిషీ చేసేవారే పాలెగాళ్లు. పన్నుల వసూళ్లు, బాటసారుల సంరక్షణ, బందిపోట్ల దాడులు జరగకుండా చూడడం వంటివి వీరి పనులు.
అయితే.. 1799నాటికి ఇండియా పూర్తిగా ఆంగ్లేయుల ఆధిపత్యం కిందకు వచ్చేస్తోంది. ఆ సమయంలో పన్నులు వసూలు చేసే బాధ్యత కింది పాలెగాళ్లకు అప్పగించకుండా.. నేరుగా బ్రిటీష్ వారే రైతులు, ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే విధానం ప్రవేశపెట్టారట. దీంతో.. పాలెగాళ్ల ఆదాయం పడిపోయింది. దీనికి వ్యతిరేకంగా.. పాలెగాళ్లంతా ఆంగ్లేయులపై నిరసన తెలపడం మొదలు పెట్టారు. తమిళనాడులో కట్ట బ్రహ్మన్నను కూడా ఈ కారణంతోనే బ్రిటీష్ వాళ్లు చంపేశారని ‘రేనాటి సూర్యచంద్రులు’ చెబుతోంది. పాలెగాళ్ల వ్యవస్థ నిర్మూలనకు ఇక్కడి నుంచే ఆంగ్లేయులు శ్రీకారం చుట్టారని భావిస్తుంటారు.
ఆ తర్వాత కాలంలో పాలెగాళ్లలో ఎదురుతిరిగారని, ఉయ్యాల వాడ నరసింహారెడ్డి కూడా ఈ కారణం చేతనే బ్రిటీష్ వారిపై పోరాటం చేశాడని, చాలా మంది చెబుతుంటారు. ఈ పోరాటంలో ఆయనకు మిగిలిన పాలెగాళ్లు కూడా తోడవడంతో దాదాపు ఏడాదిపాటు బ్రిటీష్ వారిపై పోరాటం చేసిన నరసింహారెడ్డిని.. 1874లో ఆంగ్లేయులు బంధించి, ఉరితీశారు. అంతేకాకుండా.. మరెవరో ఎదురు తిరగొద్దని ఆయన శవాన్ని కోట గుమ్మానికి వేలాడదీశారని చరిత్ర చెబుతోంది.
అయితే… ఆయన తొలి స్వాతంత్ర పోరాట యోధుడు అని మరికొందరు చెబుతుంటారు. 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందే ఆయన ఆంగ్లేయులపై పోరాటం చేశారని, అంటున్నారు. అయితే.. పోరాటాన్ని విశ్లేషించే తీరును బట్టి.. ఎవరికి కోసం తిరుగుబాటు చేశారన్నది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. పాలెగాళ్లకు రావాల్సిన రాబడిని బ్రిటీష్ ప్రభుత్వం ఆపేసింది కాబట్టే.. ఆంగ్లేయులపై ఆయన పోరాటం చేశారని, ఆ పనిచేయకుంటే పాలెగాడిగా ఆయన పాలన సాగేదన్నది కొందరి వాదన. బ్రిటీష్ వారి ఆధిపత్యాన్ని సహించలేక దేశ స్వతంత్రం కోసమే ఆయన పోరాటం చేశారన్నది మరికొందరి అభిప్రాయంగా ఉంది.