Uttarkashi Cloudburst Updates: హిమాలయాలు.. ఉత్తర భారతంలోని కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లలో విస్తరించిన ఈ కొండ ప్రాంతాలు ఎప్పుడూ భారీ వర్షాలు, వరదలకు కేంద్రబిందువులు.. ఎప్పుడు క్లౌడ్ బరెస్ట్ అవుతుందో.. ఎప్పుడు వరద , మట్టి కొట్టుకు వస్తుందో.. ఇళ్లకు ఇళ్లను, ప్రజలను సమాధి చేస్తుందో అంతుబట్టని విషయంగా మారింది. తాజాగా ఉత్తర కాశీలో క్లౌడ్ బరెస్ట్ తో భారీ వరద, మట్టి వచ్చి ఇళ్లు కొట్టుకుపోయి ప్రజలు జలసమాధి అయ్యారు. హిమాలయ సానువుల్లో ఇది సర్వసాధారణం.. ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. హిమాలయాల కిందట ఈ వర్షాకాలంలో ఉండకుంటే బెటర్.. ఆ ప్రళయ భీకరాన్ని తప్పించుకోవాలంటే అదే ముఖ్యం.
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లాలో కుండపోత వర్షాలు (క్లౌడ్ బర్స్ట్) బీభత్సం సృష్టించాయి. హర్సిల్ సమీపంలోని ధారాలీ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు ఒక గ్రామాన్ని పూర్తిగా కొట్టుకుపోయేంతగా బీభత్సం సృష్టించాయి. ఇప్పటివరకు నలుగురు మృతి చెందగా, 70 మందికిపైగా గల్లంతయ్యారు. గల్లంతైనవారిలో 11 మంది సైనికులు కూడా ఉన్నట్లు సమాచారం.
Read Also: మహావతార్ నరసింహ.. చెప్పులు విడిచి థియేటర్లోకి.. ఏ సినిమాకు ఇలా కాలేదు…
– తీవ్ర ఆస్తి నష్టం
వరద ధాటికి కార్లు, చెట్లు నీటిలో కొట్టుకుపోయాయి. పలు భవనాలు కుప్పకూలిపోయాయి. ఖీర్ గధ్ వాగులో ఒక్కసారిగా నీటిమట్టం ప్రమాదకరంగా పెరిగిపోవడంతో సమీపంలోని మార్కెట్ ప్రాంతం మొత్తం నీట మునిగింది. దీంతో కోట్లల్లో ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా. ఇప్పటి వరకు 163 రహదారులు పూర్తిగా దెబ్బతినగా, రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడటంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయంగా మారింది.
సహాయ చర్యలు ముమ్మరం
సమాచారం అందిన వెంటనే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన బృందం (SDRF), భారత ఆర్మీ, NDRF బృందాలు రంగంలోకి దిగాయి. గల్లంతైన వారిని వెతికే పనిలో అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారు. హెలికాప్టర్లు, డ్రోన్లు సహాయంతో గాలింపు కొనసాగుతోంది.
-సీఎం ధామి స్పందన
ఈ విషాదకర ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ధారాలీ ప్రాంతంలో కుండపోత వర్షాలతో జరిగిన నష్టం తెలిసి చాలా బాధగా ఉంది. సహాయక చర్యలు శీఘ్రంగా కొనసాగుతున్నాయి. ప్రజలంతా క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తున్నానని వెల్లడించారు.
-హెచ్చరికలు.. అప్రమత్తత
ఇంతకముందే భారత వాతావరణ శాఖ ఆగస్టు 4 నుంచి ఉత్తరకాశీ, పౌరీ గఢ్వాల్, టెహ్రీ, చమోలీ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై చర్యగా డెహ్రాడూన్ జిల్లా యంత్రాంగం పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించింది. అయినప్పటికీ ఈ స్థాయిలో నష్టం జరగడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ప్రస్తుతం నదీ తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వాగులు, వంకలు దగ్గరకు వెళ్లవద్దని, పిల్లలు, పశువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పరిస్థితిని పూర్తి స్థాయిలో అదుపులోకి తేవడానికి ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా చర్యలు తీసుకుంటోంది.