Uttarandhra State: విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానికి మద్దతుగా వైసీపీ ఎన్నిరకాలుగా ప్రయత్నించినా ప్రజలు పెద్దగా స్పందించడం లేదు. విశాఖ గర్జన పేరిట పొలి కేకలు వేసినా పట్టించుకోలేదు. అలాగని వ్యతిరేకించనూ లేదు. అయితే మేము రాజధానికి మద్దతుగా రోడ్డు మీదకు పిలిచినప్పుడు రాలేదని ప్రజలపై వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఏకైక రాజధాని అంటూ నినాదాలు చేయడం ఏమిటని ఉత్తరాంధ్ర ప్రజలకు శాపనార్థాలు పెడుతున్నారు. వైసీపీ నేతల ఆలోచన కూడా భిన్నంగా ఉంటుంది. మా మాటే నెగ్గాలన్న తుంటరితనం కనిపిస్తోంది. విశాఖ రాజధాని వర్కవుట్ అయ్యేలా లేకపోవడంతో సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఒక డిమాండ్ తెరపైకి తెచ్చారు. రాజధానికి ఒప్పుకోకుంటే ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోసం ధర్మాన రెడీ అయినట్టు సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో ఓ గ్రామంలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లిన ధర్మానకు అక్కడి ప్రజలు ఝలకిచ్చారు. విశాఖ రాజధానికి మద్దతు తెలపాలని కోరగా.. గ్రామస్థులు పెద్దగా స్పందించలేదు. దీంతో అసహనం వ్యక్తం చేసిన ధర్మాన చంద్రబాబు ఉత్తరాంధ్ర వచ్చి ఏకైక రాజధానికి మద్దతుగా నినాదాలు చేయిస్తే చేశారని.. విశాఖ రాజధానికి మాత్రం విముఖత చూపుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

అయితే ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు దిగడం చర్చనీయాంశంగా మారింది. ప్రజలపై అసహనం చూపడం కూడా హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీపై ప్రజలు ఏమంత సంతృప్తిగా లేరని కూడా ఆయన మాటల ద్వారా ధ్వనించింది. ఉత్తరాంధ్ర వచ్చి అమరావతి రాజధానికి మద్దతుగా చంద్రబాబు ప్రజలతో నినాదాలు చేయించడం ఏమిటని ధర్మాన ప్రశ్నించారు. ప్రజల్లో ఇంకా సైకిల్ పై వ్యామోహం పోలేదని కూడా అన్నారు. చంద్రబాబు ముసలోడు అయిపోయాడని.. కానీ ఇంకా కారుపై డ్యాన్స్ లు వేస్తున్నాడని వ్యంగ్యంగా మాట్లాడారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజలతోనే కళ్లు పొడిచేందుకు ప్రయత్నిస్తున్నారని.. విశాఖ రాజధానికి ఒప్పుకోకపోతే మా ఉత్తరాంధ్రను ప్రత్యేక స్టేట్ గా ప్రకటించాలని ధర్మాన డిమాండ్ చేశారు. కానీ గ్రామస్థుల నుంచి, చివరకు వైసీపీ నేతలు, కార్యకర్తల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ధర్మానకు సీన్ అర్ధమైంది.

ధర్మాన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జిల్లాల పునర్విభజనకు ముందు కూడా ధర్మాన గళమెత్తారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని విజయనగరం జిల్లాలో విలీనం చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాకు ఉన్న ఎడ్యుకేషనల్ సంస్థలతో పాటు పైడిభీమవరం పారిశ్రామికవాడ, మరికొన్ని పరిశ్రమలు ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే ఉన్నాయి. దీంతో అప్పట్లో ఎచ్చెర్లను విజయనగరంలో కలిపితే ఉద్యమిస్తానని ధర్మాన ప్రకటించారు. అవన్నీ మంత్రివర్గంలో చోటుదక్కనందుకు వినిపించిన అసంతృప్త వ్యాఖ్యలుగా కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు మంత్రివర్గంలో చోటుచ్చేసరికి ధర్మాన వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. ఇప్పుడు విశాఖ రాజధాని కోసం ఎవరూ ఆరాటపడనంతగా ధర్మాన పడుతున్నారు. అటు విశాఖలో భూముల వ్యవహారం, సీట్ నివేదికలో పేరు ఉండడమే స్పీడుకు కారణమన్న వార్తలు వస్తున్నాయి. గతంలో అమరావతికి హార్డ్ కోర్ గా ధర్మాన మాట్లాడారు. గతంలో ఆయన అమరావతికి మద్దతుగా చేసిన కామెంట్స్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మూడు రాజధానులకు మద్దతుగా మాట్లాడుతున్నారు. అది వర్కవుట్ అయ్యేలా లేకపోవడంతో ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.