ఉత్తరప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరిగే ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటి నుంచే వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నాయి. ప్రజల ఓట్లు సాధించేందుకు పావులు కదుపుతున్నాయి. మరోసారి జెండా ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. దేశంలోనే పెద్ద రాష్ర్టమైనందున ఇక్కడ ఎన్ని సీట్లు గెలిస్తే మనకు అంత విజయం సులువవుతుందనే ఆలోచనలో పార్టీలు పడిపోయాయి. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా సైతం యూపీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
కేంద్రమంత్రి వర్గ విస్తరణలో యూపీకే పెద్దపీట వేశారు. ఏకంగా ఇక్కడి నుంచి 14 మందిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. కొత్తగా ఏడుగురికి పదవులు కల్పించారు. మిత్రపక్షమైన అప్పాదళ్ కు సైతం సముచిత ప్రాధాన్యం కల్పించారు. రాష్ర్టంలో బీజేపీని గెలిపించే బాధ్యతను మంత్రులపై ఉంచినట్లు సమాచారం. దీంతో వారు శక్తివంచన లేకుండా కృషి చేసి పార్టీని గట్టెక్కించే పనిలో పడినట్లు తెలుస్తోంది. యూపీలో అధికారం కోసం బీజేపీతో పాటు అన్ని పార్టీలు కూడా తమ ప్రభావం చూపాలని భావిస్తున్నాయి.
మరోవైపు యూపీలో ప్రాంతీయ పార్టీలు సైతం తమ బలాన్ని నిరూపించుకుంటున్నాయి. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ తన అప్రతిహ విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా మోడీ సొంత నియోజకవర్గంలో కూడా విజయఢంకా మోగించి బీజేపీకి సవాలు విసిరింది. దీంతో బీజేపీ సైతం ప్రాంతీయ పార్టీల నుంచి గట్టి పోటీ ఉంటుందని భావించి ప్రజల మనసులను గెలుచుకునేందుకు సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో బీజేపీ ప్రజలను ప్రసన్నం చేసుకునే క్రమంలో వరాల జల్లు కురిపించే విధంగా ప్రణాళికలు రచిస్తోంది. అధికారం చేజిక్కించుకోవడం కోసం పలు రకాల పథకాలు అమల్లోకి తెచ్చేందుకు పూనుకుంటున్నట్లు సమాచారం. ప్రభుత్వంపై వ్యతిరేకతకు కరోనా కూడా ఒక కారణమైందని తెలుసుకోవచ్చు. యూపీలో బీజేపీ తిరిగి గద్దెనెక్కాలంటే పార్టీ వైవిధ్యమైన పంథాలో వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా యూపీల పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ మంత్రులు పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.