https://oktelugu.com/

అనూహ్యంగా మలుపుతిరిగిన అమెరికా ఎన్నికలు

అమెరికా ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ ఉత్కంట ను కలిగిస్తుంటాయి. దానికి కారణం అది ప్రపంచంలోనే అత్యంత శక్తివంత దేశం కావటం, ప్రపంచ రాజకీయాల్ని ప్రభావితం చేయటం.  ఇప్పటివరకు ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు  కరోనా మహమ్మారిని కట్టడి చేయటంలో అధ్యక్షుడు ట్రంప్ విఫలమయ్యాడనే అంశంపై ప్రధానంగా కేంద్రీకరించి ప్రచారం చేస్తుంటే రిపబ్లికన్లు ఆ ప్రచార సరళిని గత నాలుగు సంవత్సరాల్లో ట్రంప్ పరిపాలనలో మంచి ఆర్ధిక వృద్ధి రేటు సాధించామని, నిరుద్యోగం అట్టడుగు స్థాయిలో వుందని, చైనా ని […]

Written By:
  • Ram
  • , Updated On : September 20, 2020 9:03 am
    Follow us on

    అమెరికా ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ ఉత్కంట ను కలిగిస్తుంటాయి. దానికి కారణం అది ప్రపంచంలోనే అత్యంత శక్తివంత దేశం కావటం, ప్రపంచ రాజకీయాల్ని ప్రభావితం చేయటం.  ఇప్పటివరకు ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు  కరోనా మహమ్మారిని కట్టడి చేయటంలో అధ్యక్షుడు ట్రంప్ విఫలమయ్యాడనే అంశంపై ప్రధానంగా కేంద్రీకరించి ప్రచారం చేస్తుంటే రిపబ్లికన్లు ఆ ప్రచార సరళిని గత నాలుగు సంవత్సరాల్లో ట్రంప్ పరిపాలనలో మంచి ఆర్ధిక వృద్ధి రేటు సాధించామని, నిరుద్యోగం అట్టడుగు స్థాయిలో వుందని, చైనా ని కట్టడి చేయగలిగామని లాంటి అంశాలపై మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఇరు పార్టీల వ్యూహాలు ఈ తీరులోనే కొనసాగుతున్నాయి. అయితే నిన్న జరిగిన పరిణామం మొత్తం ఎన్నికల తీరుతెన్నుల్నే మార్చబోతుంది. అదేమిటో చూద్దాం.

    సుప్రీం కోర్టు జడ్జి మరణంతో మారిన రాజకీయం 

    భారతదేశంలో ఈ విషయం వింటే మేము చెప్పేది అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ ఇది వాస్తవం. ఇది అమెరికా రాజకీయాల్ని అత్యంత ప్రభావితం చేసే అంశం. అదేమిటో చూద్దాం. అమెరికా అత్యున్నత న్యాయస్థానం మనలాగే సుప్రీం కోర్టు. దానిలో న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తి తో కలిసి  తొమ్మిదిమంది వుంటారు. అందులో ఒకరైన 87 ఏళ్ళ మహిళా న్యాయమూర్తి రూత్ బేడర్ గిన్స్ బర్గ్ నిన్న మరణించారు. ఆవిడ ఉదారవాద తీర్పులతో ప్రఖ్యాతి చెందింది. ఆవిడ తీర్పులు ఉదారవాదులకు వుత్తేజాన్నిచ్చాయి. స్త్రీల సమానహక్కుల కోసం గల మెత్తింది. అభ్యుదయ భావాలతో నల్ల వాళ్లకి, ఒకే లింగ జంటల హక్కులకి, పేదవాళ్ళ హక్కులకి తన గొంతు కలిపి తీర్పులు చెప్పింది. సహజంగానే అటువంటి న్యాయమూర్తి చనిపోతే సమాజం ఘనంగా నివాళులర్పిస్తుంది. ఇప్పుడు సమస్య అదికాదు.

    ఆ ఖాళీలో ఎవరిని నియమించబోతున్నారనేదే ఇప్పుడు ఎన్నికల్ని ప్రభావితం చేయబోతుంది. అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తికి రిటైర్మెంట్ లేదు. జీవితకాలం వాళ్ళు న్యాయమూర్తులే. ఒకవేళ వాళ్ళంతట వాళ్ళు పనిచేయలేక తప్పుకుంటే తప్పిస్తే. ఆ పదవుల్లో ఖాళీలు ఏర్పడ్డప్పుడు  న్యాయమూర్తుల్ని మనలాగా న్యాయమూర్తులే కలిసి నియమించరు. అధ్యక్షుడు నియమిస్తాడు. ఆ నియామకాన్ని సెనేట్ ( మన రాజ్య సభ లాంటిది) ఆమోదించాల్సి వుంది. ప్రతినిధుల సభ ( మన లోక్ సభ లాంటిది) కి ఈ నియామకాలతో సంబంధం లేదు. ప్రస్తుతం తొమ్మిది మందిలో నలుగురు ఉదారవాదులు, నలుగురు సంప్రదాయవాదులు. ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ మధ్యస్తవాది. ఈ న్యాయస్థానం ఇచ్చే తీర్పులు సమాజం పై అత్యంత ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు గర్భస్రావం అంశాన్నే తీసుకుందాం. మనదేశం లో లాగా చట్టాలు సరళంగా లేవు. ఈ సమస్యపై గత దశాబ్దాలుగా వివాదం నెలకొంది. కొన్ని రాష్ట్రాల్లో గర్భస్రావం చట్టబద్దమయితే మరికొన్ని రాష్ట్రాల్లో నిషేధం. అందరూ అనుకుంటున్నట్లు అమెరికా సమాజం పూర్తి ఉదారవాద సమాజం కాదు. సగం మంది ముఖ్యంగా దక్షిణాది, మధ్య అమెరికాలలో ప్రజలు ఇప్పటికీ సంప్రదాయవాదులే. ముఖ్యంగా క్రైస్తవ మత ప్రచారకులు దీన్ని నరమేధంగా భావిస్తారు. పుట్టిన తర్వాత మనిషిని చంపటం ఎంత పాపమో ఇదీ అంతేనని వాళ్ళు భావిస్తారు. అందుకే దీనిపై ప్రతి ఎన్నికల్లో ఇంత చర్చ జరుగుతుంది. ఇటువంటివే మిగతా సమస్యలు కూడా. అది ఒకే లింగ పెళ్ళిళ్ళు కావచ్చు, సార్వజనీన ఆరోగ్య పధకం కావచ్చు, వలసదారుల విషయంలో ఎటువంటి విధానం అవలంబించాలనే దానిలో కావచ్చు, వీటన్నింటిలో డెమోక్రాట్లకు, రిపబ్లికన్లకు హస్తిమసికాంతం తేడావుంది. అందుకే ఈ అన్నింటిలో సుప్రీం కోర్టు తీర్పులు మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. అందునా వీరు జీవితకాలం పదవిలో వుంటారు కాబట్టి వీరి నియామకం అత్యంత కీలకం. ప్రస్తుతం సుప్రీం కోర్టు లో నలుగురు ఒకవైపు, నలుగురు వేరొక వైపు ఉండటంతో ప్రధాన న్యాయమూర్తి ఎటు మొగ్గితే అటు తీర్పు అనుకూలంగా వస్తుంది. ఇప్పుడు ఈవిడ స్థానం లో కొత్త న్యాయ మూర్తి ని ట్రంప్ నియమిస్తే ఆ మొగ్గు పూర్తిగా సంప్రదాయవాదుల వైపు వుంటుంది. దాని ప్రభావం వచ్చే దశాబ్దం వరకూ వుండే అవకాశం వుంది. అందుకే ఇప్పుడు ఈ ఖాళీ భర్తీ పెద్ద ఎన్నికల అంశం అయ్యింది.

    కొత్త న్యాయమూర్తి నియామకం ఈ సెనేట్ లో జరిగేనా?

    ఇప్పుడు చర్చనీయాంశం ఇదే. అధ్యక్షుడు నియమించటం వచ్చే వారమే జరుగుతుందని ట్రంప్ ప్రకటించాడు. అదీ మూడొంతులు మహిళనే నియమించవచ్చని వెల్లడించాడు. అయితే దీన్ని సెనేట్ ఆమోదించాల్సివుంది. సెనేట్ లో ప్రస్తుతం 53 మంది రిపబ్లికన్లు, 47 మంది డెమోక్రాట్లు వున్నారు. అంటే సభలో రిపబ్లికన్లకు ముగ్గురు సభ్యుల మెజారిటీ వుంది. మామూలుగానయితే అధ్యక్షుడి నియామకం ఎటువంటి సంకోచం లేకుండా ఆమోదించబడాలి. కానీ ఇక్కడే వచ్చిన చిక్కల్లా. మనలాగా అమెరికా సెనేట్ లో , ప్రతినిధుల సభలో పార్టీ విప్ జారీ చేసే అధికారం లేదు. సభ్యులు వాళ్ళ మనసాక్షిగా ఓటు వేస్తారు. పార్టీకే కాదు, వీళ్ళకు కూడా ఆ నిర్ణయం నచ్చాలి. అంటే అందరూ అలా అంతరాత్మ ప్రబోధం తో ఓటు వేస్తారని కాదు. ఎక్కువమంది పార్టీ నిర్ణయం ప్రకారమే ఓటు వేస్తారు. అలాగని అందరూ వేస్తారని నమ్మకం లేదు. సమస్యని బట్టి,వాళ్ళు ఎన్నికైన రాష్ట్ర ప్రజల మనోగతాన్ని బట్టి కొంతమంది పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగానూ ఓటు వేస్తూ వుంటారు. ఆ స్వేచ్చ ప్రతి సభ్యుడికి వుంది. కాబట్టి 53 మంది ఈ నియామకాన్ని సమర్దిస్తారని చెప్పలేము. సెనేట్ లోని సభ్యుల్లో మూడింట ఒకవంతు మంది ప్రస్తుతం తిరిగి ఎన్నికలబరిలో వున్నారు. ఇందులో డెమొక్రాట్ సెనేటర్లు దాదాపుగా ఒకే మాట మీద వుంటారు. ఎందుకంటే వాళ్ళు ఉదారవాద రాష్ట్రాలనుంచే ఎన్నిక కాబడతారు. కానీ రిపబ్లికన్లు అలా కాదు. ఇప్పుడు తిరిగి ఎన్నికలో బరిలో నుంచున్న వారిలో కొంతమందికి వుదారవాద ఓటర్ల మద్దత్తు అవసరం. అలాగే కొంతమంది వ్యక్తిగతంగా ట్రంప్ పై ద్వేషం తో వున్న వాళ్ళూ వున్నారు. ఇలా లెక్క వేస్తే అయిదు నుంచి ఏడు మంది ఎటు వేస్తారనేది ఉత్కంట గా వుంది. ఇందులో కనీసం నలుగురు వ్యతిరేకంగా ఓటేస్తే ట్రంప్ నియామకం రద్దవుతుంది. కనీసం ముగ్గురు వ్యతిరేకంగా ఓటేస్తే సగం సగం అయి టై అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో సెనేట్ చైర్మన్ అయిన దేశ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఓటుతో ట్రంప్ నియామకం నెగ్గుతుంది. అందుకే మొత్తం దేశం ఇప్పుడు సుప్రీం కోర్టు న్యాయమూర్తి నియామకం అంశం పైకి మళ్ళింది.

    ఎన్నికలపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది?

    ఖచ్చితంగా ఇది ఎన్నికలని ప్రభావితం చేసే అంశంగా మారింది. మతప్రచారం చేసే ఎవాన్జిలకన్ క్రైస్తవులు ఈ అంశంపై చురుకుగా ప్రచారం చేస్తారు. అదే సమయం లో ఈ నియామకం జరిగితే ఇప్పట్లో ఉదారవాద విధానాలకు సమాజం లో సమాధి పడినట్లేనని డెమోక్రాట్లు ముఖ్యంగా ఇటీవల ప్రభావితం చేస్తున్న వామపక్షవాదులు భావిస్తారు. అందుకే రెండు వైపులా ఈ సమస్య ప్రధాన ఎన్నికల అంశంగా మారుతుంది. ఏదైతే డెమోక్రాట్లు కరోనా మహమ్మారి అంశం పైనే ప్రజల్లోకి వెళ్లి ట్రంప్ ని ఆత్మా రక్షణలో పడేయ్యాలని భావించారో దానికి అవకాశం లేదు. ఇకపోతే ఈ అంశంలో సమాజంలో  రాను రాను సంప్రదాయవాదులకు మద్దత్తు తగ్గుతుందని పిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఇది మారిన పరిస్థితుల్లో ట్రంప్ కి అనుకూలంగా ఉండకపోవచ్చు. అదేసమయంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే అభిప్రాయం వుండదు. ఇప్పటికీ సంప్రదాయ ప్రభావం లో వున్న రాష్ట్రాల్లో ఇది ట్రంప్ మద్దత్తుదారులకు ఓ టానిక్ లాగా పనిచేసే మాట వాస్తవం. ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఏదో ఒక వైపు మొగ్గి వుండటం తో అక్కడ దీని ప్రభావం వలన పెద్దగా ఎన్నికల ఫలితాల్లో మార్పు వుండదు. కీలకమయిన తీవ్రపోటీ వున్న రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎలా వుంటుందో అంచనా వేస్తేనే ఎన్నికల ప్రభావాన్ని అంచనా వేయగలం. ఎందుకంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలు దేశవ్యాప్త ప్రజాదరణ తో సంబంధం లేదు. రాష్ట్రాల ఎలక్టోరల్ కాలేజి ని బట్టి వుంటుంది. అందులో 270 ఎవరికీ వస్తే వాళ్ళే గెలుస్తారు. ప్రస్తుత అంచనా ప్రకారం షుమారు 7,8 రాష్ట్రాలే ఈ ఎన్నికల్లో కీలకం. మారిన ఈ పరిస్థితుల్లో ఆ రాష్ట్రాల్లో ఈ అంశం ఎవరికి లబ్ది చేకూరుతుంది, ఆయా రాష్ట్రలేమిటి అనే విషయాలు మరొక్కసారి వివరంగా మాట్లాడుకుందాం.