India warns Pakistan: ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ.. భారత్‌లో అల్లర్లు, అశాంతి సృష్టించేందుకు దశాబ్దాలుగా ప్రయత్నిస్తోంది దాయాది దేశం పాకిస్తాన్. గతేడాది ఏప్రిల్‌లో జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. దీంతో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. వంద మందికిపైగా ఉగ్రవాదులను హతమార్చింది. ప్రస్తుతం ఆపరేషన్ సిందూర్ హోల్డ్‌లో ఉంది. తోక జాడితే ఆపరేషన్ సిందూర్ 2.0 ప్రారంభిస్తామని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. తాజాగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రత్వానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యలను వెల్లడించారు. గతేడాది మే 10 నుంచి 31 మంది ఉగ్రవాదులను హతమార్చామని, వీరిలో 65 శాతం పాకిస్తాన్ నేపథ్యానికి చెందినవారని తెలిపారు.
ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్లు
పహల్గామ్ దాడికి సంబంధించిన ముగ్గురు నిందితులను ఆపరేషన్ మహాదేవ్లో కాల్చి చంపామని ద్వివేదీ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ 2.0 కొనసాగుతోందని, పాకిస్తాన్‌లోని ఎనిమిది శిబిరాలపై నిఘా పెంచామని చెప్పారు. ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఈ కేంద్రాలు ఉన్నాయని హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్లో స్థానిక ఉగ్రవాదుల సంఖ్య సింగిల్ డిజిట్‌కు తగ్గిందని, 2025లో ఇద్దరు మాత్రమే చేరారని వివరించారు.
సరిహద్దు భద్రత పటిష్టం..
వెస్ట్రన్ ఫ్రంట్‌లో సమస్యాత్మక స్థితిగతులు ఉన్నప్పటికీ, కూంబింగ్ల ద్వారా నియంత్రణలో ఉన్నాయని ఆయన తెలిపారు. సరిహద్దు గ్రామాల్లో ఉద్రిక్తత తగ్గిందని, పాకిస్తాన్ తప్పిదాలకు ధీటుగా సైనిక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆపరేషన్ రీసెట్లో 22 నిమిషాల్లో స్పందించామని, సంప్రదాయ యుద్ధ పరిధిని విస్తరించామని పేర్కొన్నారు.
ప్రశాంతంగా జమ్మూ కాశ్మీర్..
అభివృద్ధి కార్యక్రమాలు, పర్యాటక పునరుజ్జీవనం ఉగ్రత్వాన్ని అరికట్టాయని ద్వివేదీ అన్నారు. అమర్నాథ్ యాత్రలో నాలుగు లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారు. ఈశాన్య సరిహద్దుల్లో మల్టీ సెక్యూరిటీ గ్రిడ్ పనిచేస్తోందని, చైనా ఔఅఇ వెంబడి నిఘా కొనసాగుతోందని తెలిపారు.
పాకిస్తాన్ కవ్వింపులకు ఎటువంటి అవకాశం లేదని, డీజీఎంవో చర్చల్లో అణు అంశాలు రాలేదని ఆయన స్పష్టం చేశారు. సైన్యం పూర్తి సిద్ధంగా ఉందని హెచ్చరించారు.