Nitin Gadkari : దేశంలో భానుడు భగ్గుమంటున్నాడు. నిప్పుల వాన కురిపిస్తున్నాడు. దీంతో చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కుపైగా నమోదవుతున్నాయి. మరోవైపు ఉత్తర భారత దేశం నుంచి వీస్తున్న వేడి గాలులకు వేడి మరింతగా పెరుగుతోంది. పశ్చిమ బెంగాల్, కర్ణాటక బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలతోపాటు తెలంగాణ, మహారాష్ట్రలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదువుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల వేళ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఎన్నికల ప్రచారానికి నాయకులు జంకుతున్నారు. పదవిలో ఉన్నంతకాలం ఏసీ ఇళ్లు, కార్యాలయాలు గడిపుతూ.. ఏసీ కార్లలో తిరిగిన నేతలంతా ఇప్పుడు ప్రచారానికి బయటకు రావడానికి భయపడుతున్నారు. ప్రచార సభల్లో స‍్పృహతప్పుతున్నారు. వడదెబ్బకు గురవుతున్నారు. డీహైడ్రేషన్ బారిన పడుతున్నారు.
కేంద్ర మంత్రికి అస్వస్థత..
తాజాగా కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి నితిన్ గడ్కరీ బుధవారం ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని యావత్మాల్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ప్రసంగిస్తూనే స్పృహ కోల్పోయారు. యవత్మాల్-వాశిమ్ స్థానం నుంచి మహాయుతి కూటమి తరపున సీఎం ఏక్‌నాథ్ శిండే వర్గానికి చెందిన శివసేన నాయకురాలు రాజశ్రీ పాటిల్ పోటీ చేస్తున్నారు. ఆమె తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గడ్కరీ సభలో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కిందపడిపోయారు. నేతలు, కార్యకర్తలు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.
నిలకడగా ఆరోగ్యం..
అస్వస్థతకు గురైన కేంద్ర మంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గత కొన్ని రోజులుగా వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆయన.. విపరీతమైన ఎండ, ఉక్కపోత కారణంగా అస్వస్థతకు గురైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పదేళ్లుగా నాగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి నితిన్‌గడ్కరీ ప్రాథినిధ్యం వహిస్తున్నారు. తాజా ఎన్నికల్లోనూ మరోసారి బరిలోకి దిగారు. తొలి విడతలో ఏప్రిల్ 19న అక్కడ పోలింగ్ జరిగింది.
మొన్న జన సేనాని కూడా..
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా వడదెబ్బకు గురయ్యాడు. ఎండలో తిరుగుతూ ప్రచారం చేస్తుండడంతో జనసేనానికి ఎండదెబ్బ తగిలింది. విజయనగరం జిల్లాలో ప్రచారం నిర్వహించిన పవన్ కల్యాణ్, నెల్లిమర్ల, మరికొన్ని చోట్ల ప్రచారంలో పాల్గొన్నారు. ఎండలో ప్రచారం నిర్వహించడంతో ఆయనకు వడదెబ్బ తగిలింది. వెంటనే పవన్ కల్యాణ్ విశాఖపట్నం వెళ్లారు. అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన తర్వాత మరింత నీరసంగా కనిపించారు. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.