India Defense Budget : రక్షణకు భారీగా వ్యయం.. భారత్ స్థానం ఇదే..

- అమెరికా రక్షణ వ్యయం 2022తో పోలిస్తే నిరుడు 2.3% పెరిగింది. 2014తో పోలిస్తే ఆదేశ రక్షణ వ్యయంలో పెరుగుదల 9.0%గా ఉంది.

Written By: NARESH, Updated On : April 24, 2024 10:02 pm

India Defense Budget

Follow us on

India Defense Budget : ప్రపంచంలో అన్ని దేశాలు ప్రస్తుతం రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇందుకోసం సైన్యానికి, ఆయుధాలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశాలు రక్షణకు ఎంత వ్యయం చేస్తున్నాయో స్టాక్ హోం అంతర్జాతీయ శాంతి పరిశోధక కేంద్రం(సిప్రి) తాజాగా నివేదిక విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రక్షణ వ్యయంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఈ దేశం రక్షణ కోసం 91 వేల కోట్ల డాలర్లు వెచ్చిస్తోంది. ఇక 2023 నివేదిక ప్రకారం భారత్‌ రూ.8,300 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తుంది. మన దేశంలో ప్రపంచంలో రక్షణ వ్యయంలో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. రెండు, మూడో స్థానాల్లో చైనా, రష్యా నిలిచాయి.

ప్రపంచ వ్యాప్తంగా 2,44 లక్షల కోట్ల డాలర్లు..
ఇక రక్షణ కోసం ప్రపంచ దేశాలు గతేడాది 2,44,300 కోట్ల డాలర్లు వెచ్చించాయని సిప్రి తెలిపింది. 2022తో పోలిస్తే ఆ మొత్తం 6.8% అధికమని పేర్కొంది. 2009 తర్వాత రక్షణ వ్యయం ఒక ఏడాదిలో ఇంత ఎక్కువ పెరగడం ఇదే తొలిసారని వెల్లడించింది. వరుసగా తొమ్మిదో ఏడాది ఈ వ్యయంలో పెరుగుదల నమోదైందని తెలిపింది.

భారత వ్యయం ఇలా..
ఇక సిప్రి నివేదిక ప్రకారం.. భారత రక్షణ వ్యయం 2022తో పోలిస్తే 2023లో 4.2% పెరిగింది. 2014తో పోలిస్తే అది 44% పెరిగింది. సిబ్బంది, నిర్వహణ వ్యయాల పెరుగుదలే భారత రక్షణ వ్యయం అధికం కావడానికి ప్రధాన కారణం. 2023 నాటి మొత్తం మిలిటరీ బడ్జెట్లో వాటిదే మూడో వంతు వాటా. చైనా, పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో.. సాయుధ బలగాల సమర సన్నద్ధతను బలోపేతం చేసుకునేందుకు భారత్ ప్రాధాన్యమిస్తోంది. మిలిటరీ వ్యయంలో దాదాపు 22% బడ్జెట్‌ను రక్షణరంగ కొనుగోళ్లకు కేటాయిస్తోంది. అందులో 75% వాటా దేశీయ కొనుగోళ్లకే వెళ్తుంది.

సిప్రి నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు..

– రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఆసియా, ఓషియానా, పశ్చిమ ఆసియాలో భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా గతేడాది ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం పెరిగింది.

– అమెరికా రక్షణ వ్యయం 2022తో పోలిస్తే నిరుడు 2.3% పెరిగింది. 2014తో పోలిస్తే ఆదేశ రక్షణ వ్యయంలో పెరుగుదల 9.0%గా ఉంది.

– సైనిక వ్యయం పరంగా ఉక్రెయిన్ గతేడాది ప్రపంచంలో 8వ స్థానంలో నిలిచింది. 2023లో ఈ రంగంపై ఆదేశం అత్యధికంగా ఖర్చు చేసింది. మొత్తం 6,490 కోట్ల డాలర్లు వెచ్చింది. రష్యా రక్షణ వ్యయంలో ఇది 50 శాతం మాత్రమే.