Youtube Channel : సోషల్ మీడియాలో అత్యంత పవర్ ఫుల్ ప్లాట్ ఫామ్ గా యూట్యూబ్ కొనసాగుతోంది. అంతేకాదు.. సరిగ్గా వినియోగించుకోవాలేగానీ అద్భుతమైన ఆదాయ వనరు కూడా! అందుకే.. లక్షలాది మంది సొంతంగా యూట్యూబ్ ఛానళ్లు ఓపెన్ చేస్తున్నారు. అయితే.. సరైన ట్రిక్స్ తెలియక, సబ్జెక్ట్ ను ఎంచుకోలేక.. చాలా మంది మధ్యలోనే వెనుదిరుగుతున్నారు. అందువల్ల సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది. యూట్యూబ్ ద్వారా విజయం అందుకున్నవారిలో ప్రస్తుత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) కూడా ఉండడం గమనార్హం.
అవును.. ఈ కేంద్ర మంత్రికి సొంతంగా యూట్యూబ్ ఛానల్ (Youtube Channel) ఉంది. ఎప్పుడో ఛానల్ తెరిచినప్పటికీ.. కరోనా సమయంలో తన ఛానల్ కు వ్యూయర్ షిప్ పెరిగిందని తెలిపారు గడ్కరీ. అయితే.. నితిన్ గడ్కరీ మంత్రి కాబట్టి, కాషాయ పార్టీ నేత కాబట్టి.. తన ఛానల్ లో ఏ రాజకీయాలో మాట్లాడుతుంటారని అనుకుంటే పొరపాటు పడ్డట్టే. లేదంటే.. కాషాయ ప్రతినిధిగా బీజేపీ సిద్ధాంతాలను వల్లెవేస్తారనుకున్నా తప్పులో కాలేసినట్టే. ఆయన చెఫ్ గా మారి లెక్చర్లు ఇస్తున్నారు!
ఇప్పటి వరకు 950 పైగా వీడియోలు తన చానల్ లో అప్ లోడ్ చేసినట్టు మంత్రి వివరించారు. కరోనా కాలంలో తన వీడియోలు చూసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, విదేశీ విద్యార్థులు కూడా ఉన్నారని తెలిపారు గడ్కరీ. ప్రస్తుతం నితిన్ గడ్కరీ ఛానల్ కు 2 లక్షల పైచిలుకు సబ్ స్క్రైబర్లు కూడా ఉన్నారు. తన ఛానల్ ను రోజూ వీక్షిస్తున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. దీనిద్వారా.. నెలకు ఏకంగా 4 లక్షల రూపాయల ఆదాయం వస్తోందని మంత్రి వెల్లడించారు.
చూశారుగా.. ఎంతో బిజీగా ఉండే కేంద్ర మంత్రి కూడా సొంత యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయడమే కాకుండా.. దాని ద్వారా భారీగా ఆదాయం కూడా ఆర్జిస్తున్నారు. సో.. మీరు కూడా ట్రై చేయండి. ఆయనకు సెలబ్రిటీ కాబట్టి.. ఛానల్ సక్సెస్ అయ్యిందని అనుకుంటున్నారేమో? అది కొంత వరకు వాస్తవమే కావొచ్చు.. కానీ, మంచి కంటెంట్ ఇస్తూ.. సిన్సియర్ గా పనిచేస్తూ పోతే ఏడాది కాలంలోనే ఛానల్ కాసుల వర్షం కురిపించడం గ్యారంటీ. మనం ఎంచుకునే జోనర్.. ప్రజెంట్ చేసే విధానమే కీలకమని మరిచిపోకండి. ఆల్ ది బెస్ట్.