Union Budget 2025: కేంద్ర బడ్జెట్( Central budget) కేటాయింపులపై సర్వత్రా చర్చ ప్రారంభం అయింది. ముఖ్యంగా ఏపీకి కేటాయింపుల విషయంలో తగిన ప్రాధాన్యం దక్కలేదన్న కామెంట్స్ ప్రారంభమయ్యాయి. ఈరోజు పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్లో బీహార్ కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఏపీకి ఎందుకు మొండి చేయి చూపారన్నది ప్రశ్నగా మారింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్ కు కేంద్రం భారీగా వరాలు ప్రకటించింది. ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ స్పందించింది. ఆ పార్టీకి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బడ్జెట్ ను అభినందించారు. గత ఏడు నెలలుగా ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి అనేక వినతులు అందించారని.. అందుకే బడ్జెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పరిష్కార మార్గం చూపిందని గుర్తు చేశారు. ముఖ్యంగా జలజీవన్ మిషన్ ప్రాజెక్టును పొడిగించిన విషయాన్ని ప్రస్తావించారు. మాన్యుఫ్యాక్చర్ రంగంలో ఏపీకి మేలు జరుగుతుందని వివరించారు. ఉడాన్ స్కీమ్లో కీలక నిర్ణయం తీసుకున్న విషయాన్ని చెప్పారు. పౌర విమానయాన రంగంలో శరవేగంగా అభివృద్ధి ఏపీలో జరుగుతోందన్నారు.
* ప్రశంసించిన లావు
అయితే ఏపీ( Andhra Pradesh) విషయంలో కేంద్రం మొండి చేసి చూపిందన్న విమర్శల నేపథ్యంలో టిడిపి ఎంపీలు వరుసగా స్పందిస్తున్నారు. టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు బడ్జెట్ను ప్రశంసించారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు అభినందనలు తెలిపారు. గడిచిన ఏడు నెలల్లో అమరావతికి 15,000 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు 16,440 కోట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం 12 వేల కోట్లు ఇవ్వనున్నారని చెప్పుకొచ్చారు. వ్యవసాయం, సామాన్యుడికి, ఎంఎస్ఎమ్ఈలకు కేటాయింపులు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులతోపాటు సి ఫుడ్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు.
* టిడిపి స్పందనకు అదే కారణం
అయితే కేంద్ర బడ్జెట్లో( Central budget ) ఏపీకి కేటాయింపులు లేవన్న విమర్శలు ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా అప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. కూటమి ప్రభుత్వం ఆర్భాటం చేసిందని.. దావోస్ లో పెట్టుబడులు రాలేదని.. ఇటు కేంద్రం ముందు చేయి చూపిందని.. ఇలా లేనిపోని ప్రచారం మొదలుపెట్టారు. అది కూటమికి ఇబ్బంది కలిగించే విధంగా మారింది. ప్రస్తుతం ఎన్డీఏలో ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ.. బీహార్ కు చెందిన జెడియు పార్టీ కీలక భాగస్వాములుగా ఉన్నాయి. కానీ బీహార్ కు దక్కిన ప్రాధాన్యం ఏపీకి దక్కకపోవడం ఇప్పుడు ఎక్కువ చర్చకు దారితీస్తోంది. రాజకీయ విమర్శలకు కారణమవుతోంది. అయితే ఈ తరహా ప్రచారం మొదలు కావడంతో టిడిపి ఎంపీలు ఒక్కొక్కరు స్పందించడం ప్రారంభించారు. ఆదిలోనే ఈ విమర్శలకు చెప్పాలని భావిస్తున్నారు.