Minister Roja: ఏపీ మంత్రి రోజా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ప్రత్యర్థులపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతుంటారు. తాను ఎక్కడ ఉన్నా రాజకీయాల గురించి మాట్లాడకుండా ఉండలేరు. చివరకు తిరుమలలో అయినా ప్రత్యర్థులను విమర్శించడానికి వెనుకాడరు. కానీ అటువంటి తిరుమలలోనే మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తరచూ శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అందులో భాగంగా శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం నుంచి బయటకు వచ్చే క్రమంలో ఆమెకు నిరసన సెగ తగిలింది.
తిరుమలలో మంత్రి రోజాను చూసిన భక్తులు, శ్రీవారి సేవకులు ఆమెను చుట్టుముట్టారు. ఆమెతో సెల్ఫీలకు దిగారు. అక్కడితో ఆగకుండా ” జై అమరావతి, జై జై అమరావతి, రాష్ట్రానికి ఒకటే రాజధాని” అంటూ నినాదాలు చేయాలని మంత్రి రోజాను కోరారు. ఈ హఠాత్ పరిణామంతో ఎలా స్పందించాలో ఆమెకు తెలియలేదు. దీంతో రోజా భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యారు. శ్రీవారి సేవకు వచ్చి ఇదేమిటంటూ వారికి సమాధానం చెప్పకుండా రోజా నవ్వుకుంటూ అక్కడ నుంచి జారుకున్నారు.మంత్రి తీరుపై భక్తులు, శ్రీవారి సేవకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ గత కొన్నేళ్లుగా ఆందోళనలు,నిరసనలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ అమరావతి ప్రాంతంలో పెద్ద ఉద్యమమే సాగుతోంది. పలు సందర్భాల్లో అమరావతి పై రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే తిరుమలలో కనిపించిన రోజాకు భక్తులు చుక్కలు చూపించారు. శ్రీవారి సేవకులు చుట్టుముట్టి ఆమెతో జై అమరావతి నినాదాన్ని చేయించే ప్రయత్నం చేశారు. అయితే రోజా ఎక్కడా ఆగ్రహం వ్యక్తం చేయకుండా చిరునవ్వుతో అక్కడ నుండి వెళ్లడం విశేషం. గతంలో చాలా సందర్భాల్లో రోజా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఒకేసారి భక్తులు, శ్రీవారి సేవకులు చుట్టూ ముట్టేసరికి ఆమె నోట మాట రాలేదు. చిరునవ్వుతోనే అక్కడి నుంచి జారుకోవడం విశేషం.