Ukraine – Russia War : ఎంతటి ఘోరకలి.. యుద్ధం మిగిల్చిన విషాదం ఇదీ

Ukraine – Russia War : మీకు గుర్తుందా.. రెండో ప్రపంచ యుద్ధంలో షిరోషిమా, నాగసాకి మీద అమెరికా అణుబాంబులు వేసింది. ఇప్పటికీ అక్కడ పచ్చగడ్డి కూడా మొలవడం లేదు. ఇరాన్‌, ఇరాక్‌పై అమెరికా యుద్ధం చేస్తే ఇప్పటికీ అక్కడ శిథిలాలు తప్ప మరేవీ కన్పించడం లేదు. బెంజిమిన్‌ ప్రాంక్లిన్‌ అన్నట్టు ‘మంచి యుద్ధం.. చెడ్డ శాంతి ఉండవు’ దేశాధినేతలు ఇవి గుర్తెరగకపోవడం వల్లే యుద్ధాలు జరుగుతున్నాయి. చివరకు కన్నీళ్లు కూడా మిగలడం లేదు. బాంబుల ధాటికి అభివృద్ధి […]

Written By: K.R, Updated On : March 8, 2023 8:40 pm
Follow us on

Ukraine – Russia War : మీకు గుర్తుందా.. రెండో ప్రపంచ యుద్ధంలో షిరోషిమా, నాగసాకి మీద అమెరికా అణుబాంబులు వేసింది. ఇప్పటికీ అక్కడ పచ్చగడ్డి కూడా మొలవడం లేదు. ఇరాన్‌, ఇరాక్‌పై అమెరికా యుద్ధం చేస్తే ఇప్పటికీ అక్కడ శిథిలాలు తప్ప మరేవీ కన్పించడం లేదు. బెంజిమిన్‌ ప్రాంక్లిన్‌ అన్నట్టు ‘మంచి యుద్ధం.. చెడ్డ శాంతి ఉండవు’ దేశాధినేతలు ఇవి గుర్తెరగకపోవడం వల్లే యుద్ధాలు జరుగుతున్నాయి. చివరకు కన్నీళ్లు కూడా మిగలడం లేదు. బాంబుల ధాటికి అభివృద్ధి ఆనవాళ్లు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. నిర్మించిన భవనాలు, ఇళ్లు, ఇలా ఒక్కటేమిటీ అన్నీ భస్మీపటలమవుతున్నాయి. సామ్రాజ్యవాదం, రాజ్య విస్తరణ కాంక్ష, నిలువెత్తు అహంభావం, దోచుకోవాలనే తాపత్రయం, ప్రపంచాన్ని శాసించాలనే కుటిల బుద్ధి వంటి కారణాలు యుద్ధానికి దారి తీస్తున్నాయి. నాటి నాజీల నుంచి నేటి ఫుతిన్‌ జమానా వరకు ఇదే జరుగుతోంది.

ఈ ప్రశ్నలకు సమాధానమేదీ?

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టి ఏడాది దాటింది. ఇప్పటి వరకూ ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారు అనే ప్రశ్నకు సమాధానం లేదు. పోనీ ఈ యుద్ధం వల్ల అటు రష్యా ఏం సాధించింది అనే ప్రశ్నకు జవాబు లేదు. ఇటు నాటో దేశాలు ఉక్రెయిన్‌కు ఏ విధంగా తోడ్పడ్డాయి అనే ప్రశ్నకూ సమాధానం లేదు. ఎటొచ్చీ అటు రష్యా తన ప్రతాపం చూపింది. ఇప్పటికీ చూపుతోంది. కానీ వేలాది కోట్లను యుద్ధం కోసం మంచినీళ్లలా ఖర్చు చేస్తోంది. ఈ ఖర్చును భర్తీ చేసుకునేందుకు ప్రజల పై పన్నుల భారాన్ని మోపుతోంది. అక్కడి దాకా ఎందుకు తన దేశంలో వెలికి తీసే ముడి చమురును భారత్‌ లాంటి దేశాలకు రూపాయల్లో విక్రయిస్తోంది. అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఉక్రెయిన్‌ కూడా యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోతోంది. కీవ్‌, మరియా పోల్‌ వంటి నగరాలు ధ్వంసం కావడంతో ఆ దేశం గుండె కాయలను కోల్పోయినట్టయింది. అటు నాటో దేశాల సహకారం లేకపోవడంతో ఉక్రెయిన్‌ చిగురుటాకులా వణుకుతోంది. బ్లూంబర్గ్‌ నివేదిక ప్రకారం అటు ఉక్రెయిన్‌ కోలుకునేందుకు దశాబ్దాలు పడుతుందని తెలుస్తోంది. రష్యా పరిస్థితి ఇందుకు భిన్నమేమీ కాదు.

నాశనం అయింది

కత్తి పట్టి యుద్ధం చేసేది వినాశానానికి కాదు..కొత్త చరిత్ర లిఖించేందుకు అంటాడు కేజీఎఫ్‌-2లో అధీర. కానీ కత్తి వల్ల జరిగిన యుద్ధాలు, బాంబుల వల్ల జరిగిన యుద్ధాలు వినాశానాన్ని తప్ప కొత్త చరిత్ర లిఖించిన దాఖలాలు ఈ భూమండలం మీద లేవు. రగిలే కాంక్ష, చెలరేగే కత్తి, రివ్వును దూసుకొచ్చే బాంబు, చిందే నెత్తురు సువర్ణాధ్యాయాలను లిఖించిన దాఖలాలు ఇప్పటి వరకూ లేవు. ఇక ఉక్రెయిన్‌ పై రష్యా భీకరమైన దాడులు చేసింది. చేస్తోంది కూడా. తాజాగా రష్యా చేసిన యుద్ధకాండ వల్ల ఉక్రెయిన్‌ ఎంత నష్టపోయిందో తెలిపే చిత్రాలు ఇప్పుడు యావత్‌ ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ డ్రోన్‌ ద్వారా డోనెట్స్క్‌లోని మరింక ప్రాంతాన్ని చిత్రించింది. ఈ ప్రాంతంలో 10,000 మంది నివసించేవారు. కానీ రష్యా యుద్ధం చేయడం వల్ల అక్కడ కనుచూపు మేరలో ఏమీ కన్పించడం లేదు. రష్యా బాంబు దాడులు చేయని ప్రాంతమంటూ లేకపోవడంతో అది మరుభూమిగా కన్పిస్తోంది. గతంలో ఈప్రాంతంపై(రష్యా యుద్ధానికి నాలుగు నెలల ముందు) డాన్‌ బాస్‌ వేర్పాటువాదులు తొలిసారి దాడులు చేశారు. తర్వాత ఉక్రెయిన్‌ ప్రతిఘటించి తిరిగి స్వాధీనం చేసుకుంది. పదివేల మంది ఉన్న నగరంలోని భవనాలే ఇలా నేలమట్టమైతే.. వాటి కింద పడి ఎంత మంది చనిపోయారో ఊహాకే అందడం లేదని ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ చెప్పడం భీతావహ పరిస్థితికి అద్దం పడుతోంది.