Ukraine – Russia War : ఓ వైపు రష్యా_ ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నది. మరో వైపు ఆ రెండు దేశాల సరిహద్దుల్లో దారుణం చోటుచేసుకుంది. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో రష్యా దేశానికి చెందిన ఒక విమానం కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు దుర్మరణం చెందారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. యుద్ధం నేపథ్యంలో రష్యా సైనిక దళాలు ఉక్రెయిన్ దేశానికి చెందిన సైనికులను సజీవంగా పట్టుకున్నాయి. వారిని యుద్ధ ఖైదీలుగా తమ దేశంలోని జైల్లో బంధించాయి. కారణాలు తెలియదు గాని రష్యా ఆ యుద్ధ ఖైదీలను ప్రత్యేక విమానంలో నిర్మానుష్య ప్రాంతానికి తరలిస్తోంది. యుద్ధ ఖైదీలు, ఆరుగురు రష్యా సైనిక సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి రష్యా సైనిక విమానం రన్ వే నుంచి బయలుదేరి వెళ్ళింది. ఉక్రెయిన్ సమీపంలోని బెల్గో రోడ్ ప్రాంతంలో కుప్పకూలింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో 65 మంది దుర్మరణం చెందారు.
బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ విమానం కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న 65 మంది మంటల్లో కాలిపోయారు. విమానంలో ఉన్న ఇంధనం ట్యాంకులు పేలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయని రష్యా రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి కారణాలు ఇంతవరకు తెలియ రాలేదు. అయితే రష్యా తమ దేశానికి చెందిన వారిని అక్రమంగా పట్టుకొని ఇలా కావాలనే చంపిందని.. దానికి ప్రమాదం జరిగిందని చెబుతోందని ఉక్రెయిన్ రక్షణ శాఖ ఆరోపిస్తోంది. రష్యా రక్షణ శాఖకు సంబంధించిన విమానం కూలిపోవడం అనుమానాలకు తావిస్తోందని అంటోంది. మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించి రష్యా ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.. ఈ ప్రమాదంలో ఎవరైనా బతికి బట్ట కట్టారా? అనే ప్రశ్నకు రష్యా రక్షణశాఖ వద్ద సమాధానం లేదు. ఈ ఘటన కు కారణాలు అన్వేషిస్తున్నామని రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ప్రత్యేక సైనిక మిషన్ విమానం కూలిన ప్రాంతానికి బయలుదేరిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఉక్రెయిన్ తో యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా దళాలు సరిహద్దుల్లో మాటు వేసి ఉన్నాయి. అంతేకాదు ఉక్రెయిన్ దేశంలోనే పలు నగరాలను ఆక్రమించాయి. అయితే ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో రష్యా విజయం సాధించకపోయినప్పటికీ.. ఉక్రెయిన్ ఆర్థిక మూలాలపై తీవ్రంగా దెబ్బ కొట్టింది. నీటి ప్రాజెక్టులను నాశనం చేసింది. విద్యుత్ ప్రాజెక్టులను పేల్చివేసింది. పలు నగరాలలో కీలక కట్టడా లను కూల్చివేసింది. అయినప్పటికీ రష్యాకు ఉక్రెయిన్ వెన్ను చూపించలేదు. ఉక్రెయిన్ దేశానికి అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు అండదండలు అందిస్తుండడంతో యుద్ధం ఇంకా రావణకాష్టం లాగా రగులుతూనే ఉంది.
అయితే ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను తరలిస్తుండగా విమానం ప్రమాదం జరగడం.. వారంతా చనిపోవడంతో ఇదంతా రష్యాకు ఇష్టం లేకనే ఇలా ప్లాన్ చేసి చంపేసిందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే తన ప్రత్యర్థులను అప్పగించడం కంటే చంపడానికే రష్యా మొగ్గు చూపుతుంది.