
Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రే ఎన్నికల సంఘం మీద రుస రుసలాడుతున్నాడు.. అగ్గి మీద గుగ్గిలవుతున్నాడు. నరేంద్ర మోదిని నానా తిట్లు తిడుతున్నాడు. అమిత్ షా పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సహజమే.. తన కోపానికి అర్థం ఉంది. తన ఆగ్రహానికి ఒక కారణం ఉంది. తమ నుంచి విడిపోయి, సొంత కుంపటి పెట్టుకొని, తన సీఎం కుర్చీ కూడా లాగేసుకున్న ఏకనాథ్ షిండేకు తమ పార్టీ ఎన్నికల గుర్తును కూడా ఇవ్వడం, పార్టీని కూడా అప్పగించిన తీరుతో ఉడికిపోతున్నాడు. మహారాష్ట్రలో అంతటి బలం ఉన్న ఆ శివసేన నుంచి ఇప్పుడే తను విడిపోయి చీలిక వర్గంగా ఏర్పడినట్టుగా తయారైంది పరిస్థితి.
శరా ఘాతమే
తాజా పరిణామం ఉద్ధవ్ కు శరాఘాతం. అయితే ప్రజల్లో మంచి పట్టు ఉంటే, తన పట్ల ప్రజలకు నమ్మకం ఉంటే కొత్త పార్టీ పేరు, కొత్త ఎన్నికల గుర్తుతో మళ్లీ వెలిగిపోవచ్చు. కానీ ఉద్దవ్ లో ఆ సామర్ధ్యాలు కనిపించడం లేదు. సమయమనం కోల్పోతున్నాడు.. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని బొంద పెట్టారు అనే విమర్శ కొంతమేరకు ఆమోదనీయమే. బాధలో ఉన్నాడు కదా అని సరి పెట్టుకోవచ్చు.
ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలా?
కానీ ఉద్ధవ్ వర్గంలోని ఓ కోవర్ట్ సంజయ్ రౌత్ ఏకంగా ఎన్నికల గుర్తును, పార్టీని తిరుగుబాటు వర్గానికి రెడ్ హ్యాండెడ్ గా పట్టించేందుకు 2000 కోట్ల డీల్ నడిచిందని ఆరోపించాడు. గంగా కేంద్ర ఎన్నికల సంఘం మీదే ఆరోపణలు చేస్తున్నాడు. ఇలాంటి సమయమనం కోల్పోయిన వ్యాఖ్యలు దీర్ఘకాలంలో ఆ వర్గానికి చేటు తెస్తాయి. నాయకత్వంలో పరిపక్వలేమి ఎప్పుడైనా పార్టీకి నష్టమే. సంజయ్ వ్యాఖ్యలే విపరీతం అనుకుంటే ఉద్ధవ్ ఏకంగా ఆ ఎన్నికల సంఘాన్నే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇన్నాళ్లు ఆయన రాజ్యాంగబద్ధంగా పదవిలో కొనసాగేందుకు కారణమైన వ్యవస్థను రద్దు చేయాలంటున్నాడు. అంటే ఇప్పుడు తనకు బాధ కలిగింది కాబట్టి ఎన్నికల సంఘాన్ని డిలీట్ చేయాలట! పరిణతి లేని వ్యాఖ్యలు ప్రజల్లో పలుచన చేస్తాయనే సోయి కూడా లేదు అతడికి. అంతే కాదు ఎన్నికల సంఘం కమిషనర్లను కూడా ప్రజలే ఎన్నుకోవాలట! ఒకవేళ ఆయన చెప్పినట్టు నిజంగానే ప్రజలు ఎన్నుకునే స్థితి వస్తుంది అనుకుంటే… సభ్యులు రాష్ట్రపతిని, స్పీకర్ ను, ఉపరాష్ట్రపతిని ఎన్నుకున్నట్టే.. ఎన్నికల సంఘం కమిషనర్లనూ ఎన్నుకునే స్థితి వస్తే.. అప్పుడైనా బిజెపి నాయకులే ఎన్నికల సంఘంలో కొలువు తీరుతారు కదా. ఇప్పుడు కనీసం మాజీ బ్యూరోక్రాట్లు, రాజకీయేతరులు ఉంటున్నారు కమిషనర్లుగా… ఎన్నికల సంఘం నిర్ణయాల్లో కోర్టులే ఎంటర్ కావు… ఇక దాన్ని కూడా బిజెపి చేతుల్లో పెట్టాలనేనా ఉద్దవ్ డిమాండ్ చేస్తోంది? అది మరింత నష్టదాయకం కాదా? ఆత్మహత్య సాదృశ్యం కాదా? దీనిని ఎలా సమర్ధించుకుంటాడు ఆ ఉద్ధవ్ ?

నిధులు వేరే ఖాతాకు మళ్ళించాడు
ఇప్పుడు తనకున్న సమస్య పార్టీ నిధులు, ఆస్తులు షిండే పాలు కాకుండా కాపాడుకోవడం… సుప్రీంకోర్టు మెట్లు ఎక్కి ఈసీ నిర్ణయం పై పోరాటం చేయడం.. పార్టీ నిధుల జోలికి వస్తే ఈసీ మీద క్రిమినల్ కేసు పెడతాను అంటున్నాడు. పార్టీ నిధులను వేరే ఖాతాలోకి మార్చాడు అన్నమాట. వీటి కోసం గనుక షిండే కూడా సుప్రీంకోర్టు తలుపు తిడితే కథ ఇంకా మరింత రంజుగా ఉంటుంది. నిజానికి స్వయం ప్రతిపత్తి ఉన్న రాజ్యాంగ సంస్థ ఎన్నికల సంఘం… దానికి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు? అధ్యక్ష ఎన్నికల్లాగా ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించాలా? ఇంకా నయం ఈ ధోరణులే అధికమైతే సుప్రీంకోర్టు జడ్జిలనూ ఇలాగే ప్రజలు నేరుగా ఎన్నుకోవాలని, కీలకమైన సైనిక బలగాల అధిపతులను కూడా ప్రజలే ఎన్నుకోవాలనే పిచ్చి డిమాండ్లు కూడా వస్తాయేమో? పాపం అధికారం కోల్పోయినందుకు ఆ ఉద్ధవ్ కు చిన్న మెదడు చిట్లినట్టుంది.