New Political Parties: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు కొత్త పార్టీలు ఆవిర్భవించనున్నాయి. ఈమేరకు ప్రక్రియ ప్రారంభించారు.. పార్టీ ఆలోచన చేస్తున్న ఇద్దరు నేతలు. కొత్త పార్టీల్లో ఒకటి తెలంగాణకే పరిమితం కాగా, మరొకటి ఏపీ, తెలంగాణలో ఆవిర్భవించబోతోంది. ఈమేరకు ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకునే పనిలో ఉన్నారు. ఇద్దరు నేతలు ఇప్పటికే మూడు ప్రధాన పార్టీల మధ్యనే పోటీ నెలకొంది. చిన్న చితకా పార్టీలను జనం పట్టించుకోవడం లేదు. మరోవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ తరుణంలో కొత్త పార్టీల ఏర్పాటుపై ఆసక్తి నెలకొంది.
గద్దర్ పార్టీ..
ప్రజాయుద్ధ నౌక, మాజీ నక్సలైట్, ప్రజా గాయకుడు గద్ధర్ కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. మొన్నటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన దశాబ్దకాలంగా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. రాజ్యాంగంతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమవుతుందని అంటున్నారు. గతంలో సాయుధ పోరాటంతోనే సమానత్వం, పేదలకు న్యాయం జరుగుతుందని ఉద్యమించాడు. అజ్ఞాతంలో ఉండి పనిచేశాడు. జనజీవన స్రవంతిలోకి వచ్చాక.. కొన్నాళ్లు వివిధ పార్టీలతో సన్నిహితంగా ఉన్నారు. చివరకు మునుగోడు ఎన్నికల సమయంలో కేఏ.పాల్ పార్టీ ప్రజాశాంతి తరఫున పోటీ చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. కానీ చివరి నిమిషంలో తప్పుకున్నారు. అంతకుముందు బీజేపీ ప్రధాని సభకు, కాంగ్రెస్ వరంగల్‌లో నిర్వహించిన రాహుల్‌గాంధీ సభకు హాజరయ్యారు. తాజాగా కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు రిజిస్టర్ చేసుకునేందుకు ఢిల్లీ వెళ్లారు.
గద్దర్ ప్రజా పార్టీ..
గద్దర్ ప్రజా పార్టీ పేరుతో ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గద్దర్ ఆయన అనుచరులు మంగళవారం ఢిల్లీ వెళ్లారు. పార్టీ రిజిస్ట్రేషన్‌కు అవసరమైన దస్త్రాలు తీసుకెళ్లారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే బుధవారం రిజిస్ట్రేషన్ అవుతుంది. రెండు నెలల తర్వాత ఎన్నికల సంఘం గుర్తింపు ఇచ్చే అవకాశం ఉంది.
రెండు రాష్ట్రాల్లో జై తెలుగు పార్టీ..
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆవిర్భవించే మరో పార్టీ పేరు జై తెలుగు. రచయిత, సాహితీవేత్త జొన్నలగడ్డ రామలింగేశ్వర్‌రావు ఈ పార్టీని ప్రకటించారు. తెలుగు భాషా సంస్కృతి పరిరక్షణకు ఒక రాజకీయ వేదిక ఉండాలనే ఉద్దేశంతో పార్టీని ప్రకటించినట్లు ఆయన తెలిపారు. తెలుగు భాష, సంస్కృతిపై ప్రజలు, రాజకీయ నాయకులకు అవగాహన ఉండాలన్నారు. ఈమేరకు విస్తృత ప్రచారం చేయడానికే పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే ఎన్నికల్లో పోటీ గురించి మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.
చిన్న పార్టీల మనుగడ కష్టమే..
ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో చిన్న పార్టీల మనుగడ కష్టంగానే ఉంది. కొదండరామ్ తెలంగాణ జన సమితి, షర్మిల వైఎస్సార్‌టీపీ, కేఏ.పాల్ ప్రజాశాంతి పార్టీలతోపాటు పాత పార్టీలు అయిన సీపీఐ, సీపీఎం కూడా తెలంగాణలో మనుగడ సాధించలేకపోతున్నాయి. ఎంఐఎం హైదరాబాద్ మినహా తెలంగాణలో ఎక్కడా గెలిచే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిల్లో గద్దర్ కొత్త పార్టీ ప్రకటన ఆసక్తికరంగా మారింది. ఇది బీఆర్‌ఎస్ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకే జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తద్వారా బీఆర్‌ఎస్‌కు లబ్ధి చేకూరుతుందని అంటున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ నాయకులు తమను ఓడించేందుకు విపక్షాలు చిన్న చిన్న పార్టీలను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.