
దేశ ప్రజలంతా ఒకటే కోరుతున్నారు. మెజార్టీ యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, సోషల్ మీడియాను ఆయుధంగా వాడే వారంతా ఇప్పుడు ‘రిజైన్ మోడీ’ అంటూ ఎలుగెత్తి చాటుతున్నారు. ట్విట్టర్ లో రిజైన్ మోడీ అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఇప్పుడు అందరికీ ప్రధాని మోడీ టార్గెట్ అయ్యారు. దేశంలో కరోనా తీవ్రతను అడ్డుకట్టడంలో.. కరోనా కల్లోలం వేళ ప్రజలకు ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో మోడీ ఫెయిల్ అయ్యాడని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదంటున్నారు.
ఇక మోడీ ఉద్యోగమివ్వు అని కొద్దిరోజులుగా ట్విట్టర్ లో కేంద్రం, మోడీపై నెటిజన్లు ‘మోడీ రోజ్ గార్ దో, మోడీ జాబ్ దో’ అంటూ హ్యాష్ ట్యాగ్ లు వైరల్ చేస్తున్నారు. ఒక్కరోజులో సుమారు 50 లక్షల ట్వీట్లతో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రధానంగా 2014 ఎన్నికల్లో మోడీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన హామీని నెటిజన్లు ఎత్తి చూపుతున్నారు.
మోడీ ప్రభుత్వం రెండోసారి గద్దెనెక్కాక ప్రజా సంక్షేమం విషయంలో పట్టించుకోలేదనే అపవాదు మూటగట్టుకుంది. కరోనా వేళ ప్రజలకు ఉద్యోగ, ఉపాధి చూపించకపోవడం పెద్ద మైనస్ గా మారింది. ప్యాకేజీ అంటూ ప్రకటించి ఒక్కరికి కూడా ఉపయోగపడలేదని విమర్శలు వచ్చాయి.
ఇక ప్రైవేటీకరణ, కార్పొరేట్లకు దోచిపెట్టే విధానాలు ప్రజల్లో ఆగ్రహానికి కారణమయ్యాయని విశ్లేషకులు అంటున్నారు. ప్రతీ విషయంలోనూ మోడీ తీరు సామాన్యుడికి దూరంగా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లకు అనుగుణంగా మారిందన్న అపవాదు తెచ్చుకున్నారు. ప్రైవేటీకరణ కొంప ముంచుతోంది.
సామాన్యుడి.. చాయ్ వాలాగా దేశ ప్రజల మెప్పు పొంది గద్దెనెక్కిన మోడీ ఇప్పుడే అదే ప్రజల నుంచి చీత్కారాలు పొందుతున్న వైనం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఏ సోషల్ మీడియా అయితే వాడి మోడీ ప్రత్యర్థులను ఓడించాడో.. తనకు ఎదురు లేకుండా చేసుకున్నాడో.. అదే సోషల్ మీడియాలో ఇప్పుడు ‘రిజైన్ మోడీ ’అన్న నినాదం ప్రతిధ్వనిస్తోంది. ఇది బీజేపీకి, మోడీని ఇరుకునపెట్టేలా కనిపిస్తోంది.