
కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటూ ఫైట్ చేస్తున్న సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ మరో వివాదాన్ని రాజేసింది. భారత భూభాగాలను తప్పుగా చూపుతూ ట్విట్టర్ మరోసారి భారత ప్రభుత్వంపై ధిక్కారాన్ని ప్రదర్శించింది. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లడ్ఢాఖ్ ను వేరే దేశంగా చూపుతూ భారత దేశ పటాన్ని వక్రీకరించింది.
ఇప్పటికే నూతన ఐటీ నిబంధనల విషయంలో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ లు కేంద్ర ప్రభుత్వంకు అనుగుణంగా భారత్ లో బాధ్యులను నియమించాయి. కానీ ట్విట్టర్ మాత్రం నియమించకుండా మొండికేస్తోంది. కేంద్రప్రభుత్వం నోటీసులు జారీ చేసినా పట్టించుకోకుండా మొండికేస్తోంది. కేంద్రమంత్రులు, ఉపరాష్ట్రపతి ఖాతాలను బ్లాక్ చేసి అవమానిస్తోంది. దీనిపై గుర్రుగా ఉన్న కేంద్రప్రభుత్వానికి ట్విట్టర్ మరో షాక్ ఇచ్చింది.
భారత్ లోని కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లఢక్ లను వేరే దేశంగా చూపుతూ భారతదేశ పటాన్ని ట్విటర్ వక్రీకరించింది. తాజా చర్యతో కేంద్రం భగ్గుమంది. ట్విట్టర్ పై కఠిన చర్యల దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని అంటున్నారు.
ట్విటర్ లోని ‘ట్వీప్ లైఫ్’ సెక్షన్ లో జమ్మూకశ్మీర్, లఢక్ ప్రాంతాలను భారత్ లో భాగంగా చూపకపోవడం దుమారం రేపుతోంది. వాటిని వేరే దేశంగా ట్విట్టర్ చూపడంపై కేంద్రప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీనిపై నెటిజన్లు కూడా ట్విట్టర్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. తీవ్రంగా మండిపడుతున్నారు.
ఇక గతంలోనూ ట్విటర్ లేహ్ ప్రాంతాన్ని చైనాలో భాగంగా తప్పుగా చూపించి పెద్ద తప్పు చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతి విషయంలోనూ చికాకు పెడుతున్న ట్విట్టర్ పై నిషేధం దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని సమాచారం. ఇప్పటికే ట్విట్టర్ ను సేఫ్ హార్బర్ అన్న రక్షణ కవచాన్ని కేంద్రం తీసేసింది.