Vijay TVK Channel: మనదేశంలో.. మిగతా రాష్ట్రాలలో రాజకీయాలు వేరు.. తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు వేరు.. అక్కడ రాజకీయ పార్టీలకు అనుబంధంగా మీడియా ఛానల్స్ ఉంటాయి. ఈ సాంప్రదాయానికి డీఎంకే శ్రీకారం చుడితే.. అన్నా డీఎంకే దానిని కొనసాగించింది.. ఇప్పుడు ఇదే వ్యవహారాన్ని దేశంలో మిగతా పార్టీలు కూడా అనుసరిస్తున్నాయి. తెలంగాణలో.. ఆంధ్రప్రదేశ్లో పార్టీకి అనుబంధంగా చానల్స్.. యూట్యూబ్ ఛానల్స్.. పత్రికలు ఉన్నాయి. నిజాలను నిష్పక్షపాతంగా వెల్లడించాల్సిన మీడియా.. పార్టీలకు భజన చేసే వ్యవస్థగా మారిపోవడం నిజంగా బాధాకరం.
తమిళనాడులో..
తమిళనాడులో డీఎంకే పార్టీకి అనుబంధంగా కలైంజర్, సన్ టివి ఉన్నాయి. ఇవి ఎప్పటినుంచో ఆ పార్టీకి అనుకూలంగా ప్రసారాలు చేస్తున్నాయి. అన్నా డీఎంకే పార్టీకి అనుకూలంగా జే టీవీ ప్రసారాలు సాగిస్తూ ఉంటుంది. పత్రికలు కూడా ఆయా పార్టీలకు అనుబంధంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో టీవీ కే విజయ్ కూడా చేరిపోయారు.
కొత్త ఛానల్ ఏర్పాటు
విజయ్ తన అమలు చేస్తున్న పథకాలు.. పరిపాలన.. ఇతర వ్యవహారాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడానికి వెట్రీ పేరుతో ఒక ఛానల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. వెట్రీ అంటే తమిళంలో విజయం అని అర్థం.. తన పార్టీలో ఉన్న వెట్రి పేరును ఛానల్ కు తమిళనాాడు ముఖ్యమంత్రి ఖరారు చేశాడు. ఇప్పటికే అన్ని అనుమతులు కూడా కేంద్రం ఇచ్చింది.. ఈ ఛానల్ కు సంబంధించి ఇతర వ్యవహారాలు కూడా పూర్తి చేశారు. క్లాస్ 38 కింద ఈ వ్యవహారం మొత్తం పూర్తి చేశారు.
ఇప్పటికే సీనియర్ జర్నలిస్టులను.. యాంకర్లను.. ఇతర విభాగాలలో పని చేసే వారిని తీసుకున్నారు. వారికి భారీగానే జీతాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం శాటిలైట్ ప్రసారాలు మాత్రమే కాకుండా.. డిజిటల్ విభాగంలో కూడా ఈ ఛానల్ ను తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విజయ్ తన ముఖ్యమంత్రిగా చేస్తున్న పనులు.. పథకాల గురించి యువతకు తెలియడానికి డిజిటల్ వేదికలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఫేస్ బుక్, ఎక్స్, ఇన్ స్టా, యూట్యూబ్ ఇతర వేదికలలో కూడా వెట్రీ ఛానల్ ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇప్పటికే పరిపాలన విషయంలో సరికొత్త విధానంలో దూసుకుపోతున్న విజయ్.. ఇప్పుడు ఏకంగా మీడియాలోకి కూడా అడుగుపెడుతున్నారు. రాజకీయ పార్టీ పెట్టిన కొద్దికాలంలోనే అధికారంలోకి వచ్చారు విజయ్. ఇప్పుడు చానల్ నిర్వహణలోకి ప్రవేశించి ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తారో చూడాల్సి ఉంది.
