TVK Maanadu: త్వరలో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే పరోక్షంగా ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాయి. అధికార డిఎంకె సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం చేసుకుంటున్నది. భారీగానే సభలు పెడుతూ హంగామా సృష్టిస్తున్నది. మరోవైపు బిజెపి కూడా తగ్గేది లేదు అన్నట్టుగా ప్రచారం మొదలుపెట్టింది. కాంగ్రెస్ డిఎంకెలో భాగస్వామ్య పార్టీ కాబట్టి.. డీఎంకే నిర్వహిస్తున్న సభల్లో పాల్గొంటున్నది. ఇక ఇటీవల టీవీకే పేరుతో పార్టీ పెట్టిన సినీ నటుడు విజయ్.. తన పార్టీ కార్యక్రమాలను వేగవంత చేసారు. ఇటీవల మధురైలో మానాడు పేరుతో భారీ సభ నిర్వహించారు. ఈ సభకు లక్షలలో జనం తరలివచ్చారు.
Also Read: ‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటన.. శ్రీతేజ్ కి ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్!
తమిళనాడు రాజకీయాలను మార్చేస్తానని.. అధికారం కోసం అడ్డదారులు తొక్కనని.. సొంతంగానే అధికారంలోకి వస్తామని.. ప్రజలకు అలవికాని హామీలు ఇచ్చి మోసం చేయలేనని విజయ్ ప్రకటించారు. తమిళనాడు అభివృద్ధికి.. తమిళనాడు ఉన్నతి కి ఏం చేయాలో తనకు తెలుసని విజయ్ పేర్కొన్నారు. విజయ్ నిర్వహించిన సభకు భారీగా జననం రావడంతో టీవీకే పార్టీ కార్యకర్తల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి నాయకులు చేరిపోతున్నారు. ఇది ఎంతవరకు తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేస్తుంది.. విజయ్ ముఖ్యమంత్రి అవుతారా.. అనే విశ్లేషణలు అక్కడి రాజకీయాలలో జోరుగా సాగుతున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవరూపం దాల్చుతుందో తెలియదు గానీ.. మధురై మానాడుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
మధురై మానాడులో భారీగా జనం రావడంతో విపరీతంగా ప్లాస్టిక్ పేరుకుపోయింది. కుర్చీలను ఎక్కడికక్కడే విరగొట్టారు. ప్లాస్టిక్ బాటిల్స్ తో మానాడు జరిగిన ప్రాంతం మొత్తం అత్యంత దుర్గంధపూరితంగా మారింది. ఫ్లెక్సీలు.. విరిగిన కటౌట్లు… ఆహార ప్యాకెట్లు.. తెగిన పాదరక్షలు.. ఇంత చెత్తతో ఆ ప్రాంతం మొత్తం డంపింగ్ యార్డ్ ను తలపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలను డీఎంకే పార్టీ నాయకులు సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారు.. తమిళనాడులో తర్వాత మారుద్దువు గాని.. ముందు ఈ చెత్త సంగతి ఏమిటంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విజయ్ ని ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు.