TV5 Rating: రాజకీయాల్లో మీడియా ప్రభావం ఎక్కువ. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తున్నాయి. సోషల్ మీడియా వచ్చాక వీటి ప్రభావం కాస్త తగ్గినా.. ఇప్పటికీ నిర్ణాయక శక్తులుగానే ఉన్నాయి. ఇక తెలుగు రాజకీయాల్లో అయితే వీటి ప్రభావం మరీ ఎక్కువ. దీంతో అన్ని ప్రధాన పార్టీలు తమ అనుకూల మీడియా చానెళ్లు, పేపర్లు పెట్టుకున్నాయి. ఆయా చానెళ్లలో తమ పార్టీ గొప్పలు చెప్పుకుంటూ భజన చేస్తున్నాయి. ఇక అధికార బీఆర్‌ఎస్ ఈ భజన చేయించుకోవడంలో ముందుంది. తెలంగాణలో అధికార పార్టీకి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా గులాం అంటుంటే.. ఆంధ్రాలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. అక్కడ టీవీ చానెళ్లు ప్రతిపక్ష టీడీపీకి భజన చేస్తున్నాయి. అధికార పార్టీకి సాక్షి టీవీ ఒక్కటే ఉండగా, టీడీపీకి ఏబీఎన్, టీవీ5, ఈటీవీ ఆంధ్రా, మహాటీవీ, ఇంకా చిన్నా చితక చానెళ్లు ఉన్నాయి.
బాబు భజనతో తేలిపోయిన టీవీ5
ఇక ఇటీవల చంద్రబాబు భజన బాగా పెంచిన టీవీ 5ని ప్రేక్షకులు చూడడం మానేస్తున్నారు. దీంతో టాప్ 3లో ఉన్న ఆ చానెల్ కాస్త ఇప్పుడు టాప్ 6లోకి చేరింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే టాప్‌టెన్‌లో కూడా ఉండే అవకాశం కనిపించడం లేదు. తాజా బార్క్ రేటింగ్స్ చూస్తే పాపం టీవీ5 అనిపించింది… కాదు, టీవీ5 కాస్తా టీవీ6 అయిపోయింది అనిపించింది… అంటే మరీ ఆరో ప్లేసుకు ఘోరంగా పడిపోయింది… రోజూ అనేక పోస్టులు, వెటకారాలు, వెక్కిరింపులు, మీమ్స్ సదరు టీవీలో వచ్చే వ్యాఖ్యల మీద, డిబేట్ల మీద… ప్రత్యేకించి న్యూస్ ప్రజెంటర్ సాంబశివరావు మీద మరీనూ.. ఇక దీనికి దీటుగా కనిపించే మహాన్యూస్ అసలు బార్క్ జాబితాలోనే కనిపించదు.
తాజా రేటింగ్స్ ఇలా..
ఇక తాజా రేటింగ్స్ చేస్తే ఎన్‌టీవీ, టీవీ9 మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. మూడో స్థానంలో ఉన్న టీవీ5 స్థానాన్ని వీ6 ఆక్రమించింది. ఇక టీవీ5 మరీ ఘోరంగా ఆరో స్థానానికి పడిపోయింది. నాలుగు, ఐదో స్థానాల్లో ఏబీఎన్, సాక్షి టీవీలు ఉన్నాయి. టాప్‌లో ఉన్న ఎన్టీవీ, టీవీ9తో పోలిస్తే వాటి రేటింగుల్లో నాలుగో వంతు రేటింగ్స్ ఇప్పుడు టీవీ5 రేటింగ్స్. పాపం… చంద్రబాబును మోసీ మోసీ, అదీ అడ్డగోలుగా, నవ్వు పుట్టించే వ్యాఖ్యలతో ఒనగూరిన ఫలితం ఇదీ… పోనీ, ఈ బాపతు అపాత్రికేయంతో చంద్రబాబుకు ఏమైనా ఫాయిదా ఉంటుందా..? నెవ్వర్… జనానికి వినోదం పుట్టించడం మినహా మరేమీ లేదు…
ఏబీఎన్ కూడా..
ఇక ఏబీఎన్ కూడా చంద్రబాబు డప్పే… కానీ కాస్తోకూస్తో పాత్రికేయ సృ ్పహ కనిపిస్తుంది… కనీసం ఇతర వార్తల్లో… అందుకే నిలదొక్కుకుంది… అందుకే అది వైసీపీ సొంత ఛానెల్ సాక్షి టీవీ, టీవీ5 చానెళ్లను దాటేసి నాలుగో ప్లేసులోకి వచ్చింది… చివరకు టీవీ5 దేనితో పోటీపడుతుందీ అంటే జనం పెద్దగా చూడని ఈటీవీ ఆంధ్రప్రదేశ్ చానెల్‌తో పోటీపడుతోంది.
ఆ చానెళ్లు లెక్కలే లేనివే..
ఇక టీవీ 1 సరే, దాన్నెప్పుడో టీవీ9 వదిలించేసుకుంది, దాని ప్రస్తావనే వృథా… సీవీఆర్ ఉండీ లేనట్టే… కాకపోతే హెచ్‌ఎంటీవీ స్థితి చూస్తేనే పాపం అనిపిస్తుంది… ఒకప్పుడు కాస్త నాణ్యంగా కనిపించిన ఆ ఛానెల్ ఇప్పుడు సోదిలో లేకుండా పోయింది. 10 టీవీ, రాజ్ న్యూస్, ఈటీవీ ఆంధ్రా, ఐ న్యూస్, తదితర ఛానెళ్లు రెటింగ్స్ లో ఇన్నా పెద్దగా ప్రభావం చూపడం లేదు.
టీవీ5 మరీ ఘోరంగా..
టీవీ5 గురించి చెప్పుకుంటున్నాం కదా… ఓవరాల్ రేటింగ్స్‌లో దారుణంగా పడిపోయింది. హైదరాబాద్ కేటగిరీలోనూ ఆరో ప్లేసు… (ఈ కేటగిరీలో టీవీ9 టాప్…) ఏపీ తెలంగాణ (బిలో 75 లాక్స్) అర్బన్ కేటగిరీలో టీవీ5 ప్లేసు మరీ ఘోరంగా ఎనిమిదో ప్లేసు… రూరల్ కేటగిరీలో ఏడో ప్లేసు… చానెల్ ఇలాగే ఉంటే చివరకు ఐన్యూస్, రాజ్‌న్యూస్, ఈటీవీ తెలంగాణ చానెళ్లతో పోటీపడే రోజులు వస్తాయేమో.
టాప్‌లో ఆ రెండు చానెళ్లు..
ఇక రేటింగ్స్‌లో ప్రస్తుతం ఎన్టీవీ, టీవీ9 మాత్రమే ఉన్నాయ. ఈ రెండు చానెళ్లనూ ఇప్పట్లో మరే చానెలూ కొట్టలేదు. ఫస్ట్ ప్లేసు గురించి ఆ రెండూ కొట్టుకుంటూనే ఉంటాయి… టీవీ9 మీద జనంలో ఎంత వ్యతిరేకత ఉన్నా, సంస్థాగత లోపాలు ఎన్ని ఉన్నా, అపాత్రికేయ దుర్వాసన ఎంత వస్తున్నా దాని ప్లేసు దానిదే… మొన్నటివారం స్వల్ప ఆధిక్యం ఎన్టీవీ మీద చూపించినా మళ్లీ జారిపోయింది… మళ్లీ కేకులు, మళ్లీ హోర్డింగులు, మళ్లీ రజినీకాంత్ భజనల ప్రమాదం తప్పిపోయింది.