Janasena- Turpu Kapu Community: వచ్చే ఎన్నికల్లో తూర్పు కాపులు ఎటువైపు? ఏ పార్టీకి మద్దతు తెలుపుతారు? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది.ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు జనాభా ఎక్కువ.ఒక్క విశాఖ నగరంలో కాపులకు తప్పించి.. మూడు జిల్లాల్లోని మిగతా ప్రాంతాల్లో ఉన్న వారంతా తూర్పు కాపులే.రాజకీయంగా వీరు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. కాంగ్రెస్, టిడిపి లను ఆదరిస్తూ వచ్చారు. వైసీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీకి కొంత మొగ్గు చూపారు. అయితే ఈసారి మాత్రం వారు జనసేన వైపు టర్న్ అయినట్లు సంకేతాలు వస్తున్నాయి.
తూర్పు కాపులను బీసీలుగా పరిగణిస్తున్నారు. బీసీలుగానే ముద్రపడ్డారు. ఉత్తరాంధ్రలో 33 నియోజకవర్గాలుగాను…. దాదాపు 20 నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. గెలుపోటములను నిర్దేశించగలరు. 2024 ఎన్నికల్లో మరోసారి వారి పాత్ర కీలకంగా మారనుంది. అందుకే అన్ని పార్టీలు వారి మద్దతు కోసం ప్రయత్నిస్తున్నాయి.ఆ సామాజిక వర్గం నుంచి బొత్స సత్యనారాయణ, కిమిడి కళా వెంకట్రావులు కీలక నేతలుగా ఉన్నారు. అయితే తూర్పు కాపులను తన వైపు తిప్పుకునేందుకు బొత్స సత్యనారాయణకు వైసీపీ హై కమాండ్ ఉత్తరాంధ్ర సమన్వయ బాధ్యతలు అప్పగించింది. కళా వెంకట్రావు సైతం టిడిపిలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. తూర్పు కాపు సామాజిక వర్గాన్ని సమన్వయపరుస్తున్నారు.అయితే క్షేత్రస్థాయిలో మాత్రం తూర్పు కాపులు జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా తూర్పు కాపులకు దగ్గర అయ్యేందుకు పవన్ ప్రయత్నించారు. చాలాసార్లు వారితో సమావేశమయ్యారు. వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తూర్పు కాపులకు కష్టంచే గుణం ఉందని.. కానీ ఆ సామాజిక వర్గ నాయకులు మాత్రం తమ రాజకీయాల కోసం కులాన్ని పట్టించుకోకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన అధికారంలోకి వస్తే తూర్పు కాపులకు అన్నింట ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అప్పటినుంచి తూర్పు కాపుల్లో ఒక రకమైన ఆలోచన ప్రారంభమైంది. జనసేన వైపు టర్న్ అవ్వడం ప్రారంభించారు.
పవన్ వారాహి 3.0 యాత్రలో మాజీ మంత్రి పడాల అరుణ జనసేనలో చేరారు. ఆమె బాటలోనే మరికొందరు తూర్పు కాపు సామాజిక వర్గం నేతలు ఉన్నట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుల కుటుంబ సభ్యులు సైతం జనసేన నేతలకు టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన తాజా మాజీలు సైతంజనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మొత్తానికైతే తూర్పు కాపు సామాజిక వర్గం 2024 ఎన్నికల్లో జనసేనకు మద్దతు తెలిపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.