Paleru Assembly seat : “ఎప్పటికయ్యేది ప్రస్తుతమో” ఈ సామెత రాజకీయాలకు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. రాజకీయాలలో పరస్పర అవసరాలు మాత్రమే ఉంటాయి. ఇందులో త్యాగాలకు, సేవానిరతికి తావులేదు. జాతీయ పార్టీలు, ప్రాంతీయ కుటుంబ పార్టీలు అన్నింటికీ ఇదే వర్తిస్తుంది. కాబట్టి ఎవరు, ఎప్పుడు, ఏ పార్టీలో శాశ్వతం కాదు. స్థానం ఎప్పుడు దక్కుతుందో ఎవరూ చెప్పలేరు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందడి నెలకొంది. మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం సిబ్బంది పలు ప్రాంతాల్లో పర్యటించారు. దీని ఆధారంగా త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే అధికార భారత రాష్ట్ర సమితి ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఖమ్మం జిల్లా పాలేరు స్థానం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ స్థానాన్ని అక్కడి ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కి కేటాయించారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు నైరాశ్యంలో కూరుకు పోయారు. అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వేగంగా పావులు కదిపింది.. తుమ్మలను పార్టీలోకి ఆహ్వానించింది. దీంతో ఆయన కూడా ఓకే చెప్పి మూడు రంగుల కండువా కప్పుకున్నారు. పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి తాను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తానని సంకేతాలు ఇచ్చారు.
పాలేరు అసెంబ్లీ స్థానంలో తుమ్మల నాగేశ్వరరావు సామాజిక వర్గానికి చెందిన రాయల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పటినుంచో పనిచేస్తున్నారు. పార్టీ కార్యవర్గానికి అండగా ఉండుకుంటూ వస్తున్నారు. కార్యకర్తల కోసం భారీగానే ఖర్చు పెట్టారు. పార్టీ తరఫున ఆందోళనలను ఆయనే ముందుండి నిర్వహించారు. అక్కడిదాకా ఎందుకు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ఆయన తనవంతు సహకారం అందించారు. ఈ సమయంలో విక్రమార్క కూడా ఆయనకు టికెట్ వచ్చేందుకు సహకరిస్తానని హామీ కూడా ఇచ్చారు. ఇక పాలేరు మీద గంపెడు ఆశలు పెట్టుకున్న రాయల నాగేశ్వరరావు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్థికంగా కసరత్తు మొదలుపెట్టారు. కానీ ఆయన అనుకున్నది ఒక్కటి.. అధిష్టానం చేస్తున్నది మరొక్కటి.
పాలేరు అసెంబ్లీ స్థానం ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావుకు కేటాయిస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో రాయల నాగేశ్వరరావు ఒక్కసారిగా డీలా పడిపోయారు.. పైకి నవ్వుతూ కనిపిస్తున్నప్పటికీ లోలోపల ఆయన అంతర్మథనం చెందుతున్నారు. తుమ్మలకు టికెట్ కేటాయిస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో తనకు ఏం న్యాయం చేస్తారని పార్టీ పెద్దలను ఆయన అడుగుతున్నట్టు సమాచారం. ఇక ఇటీవల ఒక ప్రైవేటు వేడుకకు సంబంధించి రాయల నాగేశ్వరరావు హాజరయ్యారు. అదే వేడుకకు తుమ్మల నాగేశ్వరరావు కూడా వచ్చారు. ఇద్దరు ఎదురెదురుగా తారసపడినప్పుడు నవ్వుతూ పలకరించుకున్నారు. అయితే తుమ్మల రావడం కూడా రాయలకు ఒకింత ఇష్టమే అని పార్టీలో కొన్ని వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి రాయల నాగేశ్వరరావుకు కట్టబెడతారని వారు అంటున్నారు. ఒకవేళ అవకాశం ఉంటే ఎమ్మెల్సీ స్థానం కూడా దక్కే అవకాశాలు లేకపోలేదని వారు గుర్తు చేస్తున్నారు. అయితే అధిష్టానం ఎటువంటి వరం ఇవ్వకపోవడంతో ఆయన ఒకింత ఒత్తిడికి గురవుతున్నట్టు తెలుస్తోంది. మరి వచ్చే ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావుకు రాయల నాగేశ్వరరావు ఏ విధంగా సహకరిస్తారనేది తేలాల్సి ఉంది.