TTD
TTD: తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి. అటు టీటీడీ సైతం అనూహ్య నిర్ణయాలు తీసుకుంటోంది. కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. దీనిపై భక్తుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ భద్రత దృష్ట్యా తప్పదని టీటీడీ వర్గాలు తేల్చి చెబుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో టీటీడీ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. కీలక నిర్ణయాలు తీసుకుంది. తక్షణం అవి అమల్లోకి వస్తాయని పేర్కొంది.
ఇటీవల చిరుత దాడిలో చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో యాత్రికుల భద్రత చర్యల్లో భాగంగా నడకదారి మార్గంలో కఠిన ఆంక్షలు విధించారు. దివ్య దర్శనం టోకెన్లను తాత్కాలికంగా నిలిపివేయాలని టీటీడీ యోచిస్తోంది. కేవలం మొక్కులు ఉన్నవారు మాత్రమే నడకదారి మార్గంలో రానుండడంతో రద్దీ తగ్గుతుందని అంచనా వేస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం 15000 వరకు అందుబాటులో ఉంచుతున్న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను 30 వేల వరకు పెంచాలని టీటీడీ ప్రతిపాదించింది. అటు ప్రభుత్వ అధికారులతో నేడు చైర్మన్ కరుణాకర్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రతిపాదనలన్నీ అధికారుల ముందు ఉంచనున్నారు. విస్తృత చర్చ జరిగిన తర్వాత దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అటు చిన్న పిల్లల విషయంలో కూడా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నడకదారుల్లో పిల్లల అనుమతి పై పలు ఆంక్షలు విధించింది. 15 ఏళ్లలోపు పిల్లలు గల తల్లిదండ్రులు ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గాల్లో అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా రెండు ఘాట్ రోడ్లలో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలుపుదల చేశారు.
కాగా ఇటీవల చిన్నారిని హతమార్చిన ప్రదేశంలోనే చిరుతను అటవీశాఖ అధికారులు బంధించారు. శేషాచలం అటవీ ప్రాంతంలో 25 నుంచి 30 వరకు చిరుతలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. తాజాగా పట్టుబడిన చిరుత చిన్నారిపై దాడి చేసిందేనని తెలుస్తోంది. దీనిపై నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నడక మార్గంలో కిలోమీటర్ పరిధిలో 500 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు.. అటవీ శాఖ తరపున మానిటరింగ్ సెలూన్ సైతం ఏర్పాటు చేస్తున్నట్లు డి ఎఫ్ ఓ శ్రీనివాసులు తెలిపారు. మొత్తానికైతే గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమలలో జరుగుతున్న పరిణామాలు భక్తులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి.