TTD: తిరుమల కొండపై రక్షణ ఏది.? మరో భారీ చోరీ

అయితే ఆదివారం వేకువ జామున ట్రాన్స్పోర్ట్ సిబ్బందికి ఓ ఎలక్ట్రిక్ బస్సు కనిపించలేదు. సిసి పూటేజ్ పరిశీలించగా.. గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం వేకువజామున 3.50 గంటలకు తిరుమల నుంచి తిరుపతికి బస్సు తీసుకెళ్లడానికి గుర్తించారు.

Written By: Dharma, Updated On : September 25, 2023 10:46 am
Follow us on

TTD: తిరుమల కొండపై దొంగలు పడ్డారు. అయితే దొంగలు చోరీ చేసింది బంగారమో, నగదో కాదు. ఏకంగా ఓ ఎలక్ట్రిక్ బస్సు నే ఎత్తుకుపోయారు. తిరుమల కొండ మీద భక్తుల ఉచిత ప్రయాణం కోసం టీటీడీ ధర్మ రథం పేరిట ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం వేకువజామున మూడున్నర గంటల సమయంలో డిపోలో నిలిపిన ఎలక్ట్రిక్ బస్సును దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. ఈ బస్సు విలువ రెండు కోట్ల రూపాయలు ఉంటుంది.

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులకు ఉచితంగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించడానికి కొద్ది నెలల కిందట పది ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. రోజంతా తిరిగాక వీటికి రాత్రిపూట తిరుమలలోని ట్రాన్స్పోర్ట్ కార్యాలయం డిపో వద్ద చార్జింగ్ పెడతారు. అయితే ఆదివారం వేకువ జామున ట్రాన్స్పోర్ట్ సిబ్బందికి ఓ ఎలక్ట్రిక్ బస్సు కనిపించలేదు. సిసి పూటేజ్ పరిశీలించగా.. గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం వేకువజామున 3.50 గంటలకు తిరుమల నుంచి తిరుపతికి బస్సు తీసుకెళ్లడానికి గుర్తించారు. అయితే తిరుమల జిఎంసి టోల్ గేట్ మీదగా తిరుపతికి వస్తున్న బస్సును విజిలెన్స్ సిబ్బంది ఆపకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

కొండపై అన్ని ప్రాంతాల్లో బస్సు గురించి గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఆచూకీలభ్యం కాలేదు. చివరకు చోరీ అయిందని భావించి విజిలెన్స్ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరుపతి క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జిపిఎస్ ఆధారంగా బస్సు కదలికలను గుర్తించారు. ఆ బస్సు తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బస్సును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఒక్కడా? ఎక్కువమంది కలిసి ఈ చోరీకి పాల్పడ్డారా? అన్నది తెలియాల్సి ఉంది.

సరిగ్గా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలోనే టిటిడికి చెందిన బస్సు చోరీకి గురికావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో ఓ అధికారి అనధికారికంగా విష్ణు అనే వ్యక్తిని డ్రైవర్ గా నియమించుకున్నారు. ఈనెల 16న చార్జింగ్ లో ఉన్న ఎలక్ట్రిక్ కారును అతడు అపరించకుపోయాడు. ఒంటిమిట్ట వద్ద రవాణా శాఖ అధికారికి పట్టుబడ్డాడు. అయితే ఈ విషయాన్ని టీటీడీ ట్రాన్స్పోర్ట్ అధికారులు గోప్యంగా ఉంచారు. విష్ణుని మందలించి పంపించేశారు. అతడే బస్సు చోరీకి పాల్పడి ఉంటాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీటీడీ ఆస్తులుకు రక్షణ లేకుండా పోతుందని విపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.