TSRTC Dasara Offer: ఆర్టీసీ దసరా బొనాంజా.. బస్సు ఎక్కితే బహుమతులే బహుమతులు

తెలంగాణలో దసరా అతిపెద్ద పండుగ. ఈ పండుగను జరుపుకునేందుకు ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా సొంతప్రాంతాలకు వస్తూ ఉంటారు. ఇలా వచ్చే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే వారిని గమ్యస్థానాలకు చేరవేసేందుకు ఆర్టీసీ ఈసారి వీలైన ఎక్కువ బస్సులు నడిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

Written By: Bhaskar, Updated On : October 11, 2023 5:34 pm

TSRTC Dasara Offer

Follow us on

TSRTC Dasara Offer: ఏ వ్యాపారమైనా సరే లాభాల బాటలో పయనించాలంటే వినియోగదారుల అభిమానాన్ని చూరగొనాలి. వారు సంస్థ నుంచి ఏం ఆశిస్తున్నారో పసిగట్టాలి. వారికి అనుగుణంగా కార్యకలాపాలు సాగించాలి. అప్పుడే ఆ సంస్థ లాభాల్లో పయనిస్తుంది. ప్రస్తుతం ఇదే సూత్రాన్ని ఒంట పట్టించుకుందేమో.. ఆర్టీసీ కూడా వ్యాపార సిద్ధాంతాన్ని అమలు చేస్తోంది.. సాధారణంగా పండుగల సందర్భాల్లో వ్యాపార సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తాయి. కొనుగోళ్లు పెంచుకునేందుకు రకరకాల బహుమతులను అందజేస్తాయి. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ కూడా అదే బాటలో పయనిస్తోంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇలాంటి బహుమతుల ఆఫర్లు ప్రకటించి భారీగా ఆదాయాన్ని వెనకేసుకున్న ఆర్టీసీ.. తెలంగాణలో అతిపెద్ద పండుగైన దసరాను కూడా క్యాష్ చేసుకునే పనిలో పడింది.

తెలంగాణలో దసరా అతిపెద్ద పండుగ. ఈ పండుగను జరుపుకునేందుకు ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా సొంతప్రాంతాలకు వస్తూ ఉంటారు. ఇలా వచ్చే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే వారిని గమ్యస్థానాలకు చేరవేసేందుకు ఆర్టీసీ ఈసారి వీలైన ఎక్కువ బస్సులు నడిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇదే క్రమంలో ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో వెళ్లకుండా ఆర్టీసీలో మాత్రమే ప్రయాణించే విధంగా ఆఫర్లు ప్రకటించింది. ఇందులో భాగంగా గత రాఖీ పౌర్ణమికి ప్రకటించిన విధంగానే, దసరాకు లక్కీ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసి.. వారిని ఘనంగా సత్కరించాలని ఆర్టీసీ భావిస్తోంది. లక్కీ డ్రాలో గెలుపొందిన విజయతలకు 11 లక్షల నగదు బహుమతులను అందించనుంది. ప్రతి రీజియన్ కు ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు.. మొత్తం 110 మందికి బహుమతులు ఇవ్వనుంది. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు, మళ్లీ 28 నుంచి 30 తేదీల్లో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ఆయా తేదీల్లో ప్రయాణం పూర్తయిన తర్వాత టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నెంబర్ ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటుచేసిన డ్రాప్ బాక్స్ లలో వేయాలి. ఈ డ్రాప్ బాక్సులు పురుషులు, మహిళలకు వేరువేరుగా ఉంటాయి. లక్కీ డ్రా అనంతరం డ్రాప్ బాక్స్ సంబంధిత ఆర్ఎం కార్యాలయాలకు చేర్చి.. ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి పదిమంది చొప్పున విజేతలను అధికారులు ఎంపిక చేస్తారు. మొత్తం 11 రీజియన్లలో కలిపి 110 విజేతలను ఎంపిక చేస్తారు. అనంతరం వారికి నగదు బహుమతులు అందజేస్తారు.

రాఖి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 31న ఆర్టీసీ ఇదేవిధంగా లక్కీ డ్రా నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి మహిళల నుంచి అనూహ్య స్పందన రావడం.. 33 మంది మహిళ ప్రయాణికులను ఎంపిక చేసి, వారికి 5.50 లక్షలు నగదు అందజేసి ఘనంగా సంస్థ సత్కరించింది. ఈ రాఖీ పౌర్ణమి స్ఫూర్తితోనే దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలకు లక్కీ డ్రా నిర్వహించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇక ఈ లక్కీ డ్రాకు ముందస్తు రిజర్వేషన్ చేస్తున్న ప్రయాణికులు కూడా అర్హులే. టికెట్ వెనకాల పోను నంబర్ రాసి డ్రాప్ బాక్స్ లలో వేయాలి.. దసరా లక్కీ డ్రాకు సంబంధించి పూర్తి వివరాలకు టిఎస్ఆర్టిసి కాల్ సెంటర్ నెంబర్లు 040_69440000,040_23450033ను సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.