
TSPSC Leak: ” ఆ రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజు బిజెపి మనిషి.. అతడికి భారతీయ జనతా పార్టీ పెద్దలతో పరిచయాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఇందులో భాగంగానే నోటిఫికేషన్లు వేస్తోంది. దీన్ని జీర్ణించుకోలేక భారతీయ జనతా పార్టీ ఇలా లీకులు చేస్తోంది” ఇదీ సామాజిక మాధ్యమాల్లో భారత రాష్ట్ర సమితి చేస్తున్న ప్రచారం. “బాగున్నావా జీడిగింజా అంటే..నల్లగున్న నాకేం సిగ్గు” అన్నదట. ఇప్పుడు టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో అధికార భారత రాష్ట్ర సమితి చేసుకుంటున్న సమర్థన కూడా అదే విధంగా ఉంది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత 8 సంవత్సరాల అనంతరం ప్రభుత్వం వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసింది.. వాస్తవానికి ప్రభుత్వానికి గనక చిత్తశుద్ధి ఉంటే న్యాయపరమైన చిక్కులను ఎప్పుడో పరిష్కరించగలిగేది. కానీ ఎన్నికలు ఉన్నాయనే నెపంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తోంది. కానీ వీటికి తగినట్టుగా సిబ్బందిని నియమించలేదు.. అందుకే గత్యంతరం లేక టీఎస్ పీఎస్సీ అవుట్ సోర్సింగ్ సిబ్బంది మీద ఆధారపడాల్సి వస్తోంది. పైగా అత్యంత భద్రత మధ్య ఉండే సిస్టం రూమ్ లోకి కూడా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రవేశిస్తున్నారు అంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఏఈ పేపర్ లీక్ ఉదంతానికి సంబంధించి.. ప్రవీణ్ ఒక్కడే నిందితుడు కాదు. ఇతడికి రాజశేఖర్ రెడ్డి అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కూడా సహకరించాడు. అతడు సిస్టం ఆపరేటర్ కావడంతో ప్రశ్నాపత్రం లీక్ అనేది సులభంగా జరిగిపోయింది.. టీఎస్ పీఎస్సీ బోర్డులో చాలా వరకు ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం ఏళ్లకు ఏళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీనివల్ల ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి పెరిగిపోతోంది. మరోవైపు ప్రతి విషయానికి అన్ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో సిస్టమ్స్ ఆపరేటర్ల అవసరం పడుతోంది. ఆ అవసరాలకు తగ్గట్టుగా సిబ్బంది లేకపోవడంతో కమిషన్ ఇబ్బంది పడుతోంది..అందువల్లే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మీద ఆధారపడుతోంది.. కీలక విభాగాల్లోకి వారు వెళ్తుండడంతో అంతర్గత వ్యవహారాలు బయటకు పొక్కుతున్నాయి. ఏఈ ప్రశ్న పత్రం లీక్ విషయాన్ని కమిషన్ కనీసం పసిగట్టలేకపోయింది. పైగా నిందితులు ఫోన్ చేసి సమాచారం ఇస్తే తప్ప తెలుసుకోలేని స్థితిలో ఉంది.

కమిషన్ కార్యాలయంలో కొన్ని కొన్నిచోట్ల సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదు. మరోవైపు మొన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అంతంతమాత్రంగా కేటాయింపులు జరిగింది. ఈ కేటాయింపులు దేనికి సరిపోని పరిస్థితి. మరోవైపు ఉద్యోగుల నియామకంలోనూ ప్రభుత్వం శీతకన్ను ప్రదర్శించింది. దీంతో ఉన్నవారితోనే పని చేయించాల్సిన పరిస్థితి కమీషన్ కు ఏర్పడింది. దీనివల్ల ఉన్నవారి మీద ఒత్తిడి పెరిగిపోతోంది. అక్కడిదాకా ఎందుకు ఈ ప్రశ్న పత్రం రూపొందించిన సిస్టమ్స్ గదిలో.. ఓ మహిళ ఉద్యోగినికి సంబంధించిన కంప్యూటర్ మరమ్మతులకు గురయింది. దాన్ని పరిష్కరించే బాధ్యత ప్రవీణ్ కుమార్ రాజశేఖర్ కు అప్పగించాడు. సదరు మహిళా ఉద్యోగి అదే సమయానికి చైర్మన్ గదికి వెళ్లడంతో.. ఆమె డైరీలో ఉన్న సిస్టం లాగిన్ పాస్వర్డ్ సేకరించి వెంటనే ఆ ప్రశ్న పత్రాన్ని పెన్ డ్రైవ్ లోకి డౌన్లోడ్ చేశారు. అత్యంత పట్టిష్టమైన భద్రత ఉండే సిస్టం గదిలోకి ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి పెన్ డ్రైవ్ తో వెళితే కనీసం పసిగట్టలేని స్థితిలో బోర్డు ఉంది. క్షేత్ర స్థాయిలో ఇన్ని వైఫల్యాలు కనిపిస్తున్నప్పుడు.. వాటిని చక్కదిద్దకుండా.. కొత్వాల్ కో డాంటే అనే సామెత తీరుగా ప్రభుత్వం ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడం గమనార్హం.