
AP MLC Election Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు విజయం సాధించారు. ఏపీలో తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 13న ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మొత్తం 139 మంది బరిలో నిలిచారు. పట్టభద్రులు 3, ఉపాధ్యాయ స్థానాలు 2, స్థానిక సంస్థలకు సంబంధించి 4 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ రోజు 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. తొలి ఫలితం శ్రీకాకుళంలో వెల్లడైంది. వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు, సమీప ఇండిపెండెంట్ అభ్యర్థి ఆనెపు రామక్రిష్ణపై గెలుపొందారు. రామారావుకు 632 ఓట్లు రాగా..ఇండిపెండెంట్ అభ్యర్థి రామక్రిష్ణకు 108 ఓట్లు వచ్చాయి. రామారావు 524 ఓట్ల భారీ ఆధిక్యతతో విజయం సాధించారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి వైసీపీ హైకమాండ్ నర్తు రామారావు పేరును ప్రకటించింది. అయితే తూర్పుకాపులు ఈ స్థానాన్ని ఆశించారు. కానీ హైకమాండ్ అనూహ్యంగా యాదవ సామాజికవర్గానికి చెందిన నర్తు రామారావును ఎంపిక చేసింది. ఇది తూర్పుకాపులకు రుచించలేదు. కానీ వైసీపీలో ఉన్న తూర్పుకాపులు గుంభనంగా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో తూర్పుకాపు సంక్షేమ సంఘం రంగంలోకి దిగింది. వైసీపీ హైకమాండ్ తీరును నిరసిస్తూ ఇండిపెండెంట్ ను బరిలో దింపడానికి డిసైడ్ అయ్యింది. సర్పంచ్ ల సంఘంలో యాక్టివ్ గా ఉండే ఆనెపు రామక్రిష్ణను రంగంలోకి దించింది. కానీ ఓటమే ఎదురైంది.

జిల్లాలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు మొత్తం 729. అందులో తూర్పుకాపు సామాజికవర్గానికి 196 ఓట్లు ఉన్నాయి. కాళింగ సామాజికవర్గానికి చెందినవి 106, వెలమ సామాజికవర్గానికి 93 ఓట్లు ఉన్నాయి. యాదవ సామాజికవర్గ ఓట్లు కేవలం 44 మాత్రమే. రామక్రిష్ణ టీడీపీ ప్రభుత్వ హయాంలో జడ్పీటీసీగా పనిచేశారు. ఇండిపెండెంట్ గా బరిలో దిగేందుకు టీడీపీకి రాజీనామా చేశారు. అయితే టీడీపీకి స్థానిక సంస్థల్లో ఓట్లు తక్కువ. అందుకే పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. సాక్షాత్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ ఎమ్మెల్యే అశోక్ సైతం ఓటు వేయ్యలేదు. టీడీపీ శ్రేణులు చాలావరకూ ఓటింగ్ కు గైర్హాజరయ్యాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి రామక్రిష్ణకు పోలైన 108 ఓట్లు తూర్పుకాపులకు చెందినవేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికార పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం, టీడీపీ ఓటింగ్ కు గైర్హాజరైన ఇండిపెండెంట్ అభ్యర్థికి వందకు పైగా ఓట్లు రావడం గమనార్హం.