TSPSC Paper Leak : టీఎస్.పీఎస్సీ పేపర్‌ లీకేజీ: మరో ముగ్గురు అరెస్ట్.. సిట్ కీలక ముందడుగు

TSPSC Paper Leak : గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌ లీకేజీపై మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు సిట్‌ సిద్ధమవుతోంది. పేపర్‌ లీకేజీతో సంబంధం ఉన్నట్లు నిర్ధారణ అయి అరెస్టయిన ఇద్దరు టీఎస్ పీఎస్సీ ఉద్యోగులు షమీమ్‌, రమేశ్‌తోపాటు మాజీ ఉద్యోగి సురేష్ ను ఐదు రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. దాంతో ఆ ముగ్గురు నిందితులను సిట్‌ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వీరిలో షమీమ్‌, […]

Written By: Bhaskar, Updated On : March 29, 2023 7:33 pm
Follow us on

TSPSC Paper Leak : గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌ లీకేజీపై మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు సిట్‌ సిద్ధమవుతోంది. పేపర్‌ లీకేజీతో సంబంధం ఉన్నట్లు నిర్ధారణ అయి అరెస్టయిన ఇద్దరు టీఎస్ పీఎస్సీ ఉద్యోగులు షమీమ్‌, రమేశ్‌తోపాటు మాజీ ఉద్యోగి సురేష్ ను ఐదు రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. దాంతో ఆ ముగ్గురు నిందితులను సిట్‌ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

వీరిలో షమీమ్‌, సురేష్ లకు లీకేజీ కేసు ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ ద్వారా గ్రూప్‌-1 ప్రశ్నపత్రం అందగా, రమేష్ కు రాజశేఖర్‌రెడ్డి ద్వారా అందినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో.. టీఎస్ పీఎస్సీలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న షమీమ్‌కు అత్యధికంగా 127 మార్కులు రాగా, రమేష్ కు 103 మార్కులు, మాజీ ఉద్యోగి సురేష్ కు 100కు పైగా మార్కులు వచ్చినట్లు ఇప్పటికే తేలింది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు నిందితుల ద్వారా ఇంకా ఎంతమందికి పేపర్‌ లీకైంది? ఎన్ని చేతులు మారింది.? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

ఇప్పటికే నిందితుల కాల్‌డేటాను సేకరించిన పోలీసులు వాటి ఆధారంగా నిందితులను విచారించవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో 100కు పైగా మార్కులు వచ్చిన అభ్యర్థులందరూ సిట్‌ ఆదేశంతో విడతల వారీగా విచారణకు హాజరవుతున్నారు. నేడో రేపో వీరందరి విచారణ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. నేరుగా విచారణకు హాజరయ్యే అవకాశం లేనివారు, ఇతర ప్రాంతాల్లో సివిల్స్‌కు ప్రిపేరవుతున్న కొందరు అభ్యర్థులు ఫోన్‌ ద్వారా సిట్‌ అధికారులకు వివరాలు వెల్లడిస్తున్నట్లు తెలిసింది. కాగా, ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నలుగురు ప్రధాన నిందితులు ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి, ఢాక్యా, రాజేశ్వర్‌ల పోలీస్‌ కస్టడీ ముగిసింది. దీంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు.