తెలంగాణ రాష్ట్రంలో రోజుకు దాదాపు 5 వేల కేసులు నమోదవుతున్నాయి. నిజానికి ఇంతకు రెండు మూడు రెట్లు నమోదవుతున్నాయిగానీ.. వివరాలు వెల్లడి కాకుండా ప్రభుత్వం కట్టడి చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. అదలా ఉంచితే.. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది.
కొవిడ్ రోగులకు బెడ్లు దొరకట్లేదు. ఐసోలేషన్లో ఉన్నవారికి ఆక్సీజన్ లభించట్లేదు. ఇంకా.. రెమ్ డెసివర్ ఇంజెక్షన్ల కోసం జనాలు బారులు తీరుతున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా.. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అంతా బాగానే ఉందని చెప్పడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రైవేటు ఆసుపత్రులు ఇదే అవకాశం అనుకుంటూ.. ఇష్టారీతిన డబ్బు గుంజుతున్నాయి. రోజుకు సుమారు 40 నుంచి 50 వేలు వసూలు ఛార్జ్ చేస్తూ.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేనాటికి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయని రోగుల బంధువులు బహిరంగంగానే చెబుతున్నారు. ఇక, అంత ఖర్చు చేయలేని అభాగ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే.. అక్కడ బెడ్లు లభించట్లేదు. దీంతో.. ఏం చేయాలో అర్థం కావట్లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు.
ఐసోలేషన్లో ఉన్నవారిని ఆక్సీజన్ కొరత వేధిస్తోందనే వార్తలు వస్తున్నాయి. కొవిడ్ రోగులకు ఇచ్చే రెమ్ డెసివర్ ఇంజక్షన్ కోసం జనాలు రోజుల తరబడి బారులు తీరుతున్నట్టు ప్రధాన మీడియా ఆధారాలతో నిరూపిస్తోంది. అయినప్పటికీ.. అంతా బాగానే ఉందని మంత్రి చెప్పడంపై జనం మండిపడుతున్నారు. ఒక్క ప్రెస్ మీట్ పెట్టి, అంతా సూపర్ అని చెబితే అయిపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు.
అంతేకాకుండా.. కేసుల తీవ్రత పెరుగుతున్నా లాక్ డౌన్ విధించే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు మంత్రి. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకోవచ్చు. కానీ.. జనాలు బయటకు రావొద్దని చెబుతున్నారు. మరి, పని చేయకపోతే తిండి ఎలా అని ప్రశ్నిస్తున్నారు జనం. సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ.. ప్రభుత్వ వైఖరిలో మార్పు రావట్లేదని అంటున్నారు. ఇప్పటికైనా వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నాలు మానుకొని, పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు జనం.