భారత్ లో కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో లాక్డౌన్ చర్యలు చేపట్టాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ, తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ఈనెల 31వరకు లాక్డౌన్ దిశగా చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగా టీఎస్ సర్కార్ కరోనా పట్ల నిర్లక్ష్యం వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణలో 1897 చట్టం ప్రకారం లాక్డౌన్ ప్రవేశపెట్టామని.. ఇందుకు సంబంధించిన నిబంధనలను సీఎస్ సోమేష్ కుమార్-తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు.
నేటి నుంచి మార్చి 31 వరకు తెలంగాణ లాక్డౌన్ అమల్లో ఉంటుంది. ప్రజాలెవరూ రోడ్లపైకి రాకుడదు. ఒక కాలనీలో వాహనాలు ఒకటి- రెండు కిలోమీటర్లు మాత్రమే తిరగాలి. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి. పోలీసుల దృష్టిలో ఎక్కువసార్లు పడితే ఆ వాహనాన్ని సీజ్ చేస్తారు. ఈ వాహనాలను వైరస్ తీవ్రత తగ్గిన తర్వాతే ఇస్తారు. నిత్యావసర వస్తువులు క్యారీ ప్రైవేట్ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రతీ బైకుపై ఒక వ్యక్తి.. కారు-ఇతర ఫోర్ వీలర్ వాహనాల్లో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది. చట్టం అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారు. చట్టం ఉల్లంఘిస్తే ఆరు నెలల జైలు శిక్ష వంటి కఠిన చర్యలు ఉంటాయి.
ప్రతీఒక్కరు స్వీయ నియంత్రణ పాటించినట్లయితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం విధించే నిబంధనలు తూచ తప్పకుండా పాటించడంతోపాటు. కరోనాపై అవగాహన పెంచుకుంటే ఈ మహమ్మరికి దూరంగా ఉండొచ్చు. ఆ దిశగా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.