దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 415 కు చేరిన నేపథ్యంలో ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి రాజకీయాలకు అతీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ప్రయత్నం చేస్తుండగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం సంకుచిత రాజకీయాలను వదలలేక పోతున్నట్లున్నది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తరచూ విరుచుకు పడిపోతూ ఉండే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ సహితం ప్రధాని ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనడమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గల అవగాహనా గురించి పలు సూచనలు చేస్తూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా డొమెస్టిక్ విమానాలను సహితం రద్దు చేయాలని ఆమె లేఖ వ్రాసిన కొద్దీ గంటలకే బుధవారం నుండి రద్దు చేయాలని కేంద్రం నిర్ణయికం తీసుకోంది.
బీజేపీయే తనకు ప్రధాన ప్రత్యర్థి కానున్నదని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సహితం ఇది చిల్లర రాజకీయాలకు సమయం కాదని, కేంద్రంతో పూర్తి అవగాహనతో పనిచేస్తామని ప్రకటించారు. పైగా కరోనా విషయంలో ప్రధానిని అవహేళన చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టినవారిపై తగు చర్య తీసుకోమని డిజిపిని ఆదేశించారు. కేరళ, ఏపీ, పంజాబ్, ఒడిస్సా తదితర ముఖ్యమంత్రులు సహితం కేంద్రంతో కలసి వ్యవహరిస్తున్నారు.
కానీ, దేశ ప్రజలు అందరిని ఈ పోరులో ఒకటిగా చేసిన జనతా కర్ఫ్యూ గిరినుంచి గాని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం గురించి గాని ఒక్క మాట కూడా మాట్లాడకుండా, వైరస్ నిరావణకు నిర్మాణాత్మకంగా ఒక సలహా యివ్వకుండా రాహుల్ గాంధీ తరచూ ప్రధానిని లక్ష్యంగా చేసుకొని పోస్ట్ లు పెట్టడం ఆ పార్టీ వారికే రుచించడం లేదు.
తాజాగా ప్రధాని మోదీకి రెండు ప్రశ్నలను కూడా ట్విట్టర్ వేదికగా సంధించడం ఆయన ధోరణిని వెల్లడి చేస్తున్నది. ‘‘ గౌరవనీయ ప్రధాన మంత్రిగారూ…. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం వెంటిలేటర్లను, మాస్కులను అధిక మొత్తంలో ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అయితే మన దేశంలో మార్చి 19 వరకు కూడా వాటి దిగుమతులకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు?” అంటూ ఒక ప్రశ్నను లేవనెత్తారు.
“ఇక రెండోది… దీని వెనకున్న కుట్రదారులెవరు? ఈ చర్య క్రిమినల్ కుట్ర కిందికి రాదా?’’ అని ప్రశ్నించారు. లోపాలను వెతకడమే గాని, నిర్మాణాత్మకంగా మాట్లాడటం ఆయనకు తెలియదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.