TS Government Coming Down: బాసర ట్రిపల్ ఐటీలో 12 సమస్యల పరిష్కారం కోసం వారం రోజులుగా విద్యార్థుల శాంతయుత నిరసనకు రాష్ట్ర ప్రభుత్వం తిగివస్తోంది. ఐదు రోజులు ఉదయం వేళ మాత్రమే నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు ఆరో రోజు ఆదివారం నుంచి 48 గంటల జాగరణ దీక్ష చేపట్టారు. మొదటి నాలుగు రోజుల దీక్షతో డైరెక్టర్‌ను నియమించి, ఏవోను తొలగించిన ప్రభుత్వం ఆరో రోజు సాగరణ దీక్షతో మరింత అలర్ట్ అయింది. నిరసనన మొదలైన రెండో రోజే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీ రాహుల్ బొజ్జా, జిల్లా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ‘విద్యార్థుల 12 డిమాండ్లు చాలా సిల్లీ’గా ఉన్నాయంటూ కామెంట్ చేశారు. వెంటనే ఆందోళన విరమించి తరగతులకు హాజరు కావాలని సున్నితంగా హెచ్చరించారు.
‘సిల్లీ’ని సీరియస్‌గా తీసుకున్న విద్యార్థులు
మంత్రి హోదాలో తమ డిమాండ్ల పరిష్కారానికి యూనివర్సిటీకి రావాల్సిన అధికారులు, మంత్రి హైదరాబాద్‌లో ఏసీ రూంలో కూర్చొని చిర్చించి.. తర్వాత తమ సమస్యలను చిన్నవిగా చేసి చూసేలా, తమ నిరసనను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో విద్యార్థులు సీరియస్ అయ్యారు. మూడో రోజు నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ లేదా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బాసర ట్రిపుల్ ఐటీకి రావాలని డిమాండ్ చేశారు. వారిలో ఎవరో ఒకరు వచ్చి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో మంత్రితోపాటు అధికారులు మౌనం పాటించారు. సిల్లీ సమస్యలే సీరియన్ కావడంతో నాలుగో రోజు సమస్యల పరిష్కారంలో భాగంగా డైరెక్టర్‌ను నియమిస్తూ విద్యాశాఖ మంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అయినా విద్యార్థులు కొంత వెనక్కి తగ్గుతారని భావించారు. కానీ నియామకం రోజే విధుల్లో చేరిన డైరెక్టర్ విద్యార్థుల సమస్యల పరిష్కారాని ఎలాంటి చొరవ చూపలేదు. ఈ క్రమంలో విద్యార్థుల్లో కీలకమైన మరో డిమాండ్ ఏవో తొలగింపు. దీనికి కూడా ప్రభుత్వం తలొగ్గింది. తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్న ఏవోను విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయినా విద్యార్థుల నిరసన ఆగలేదు.
Also Read: Y S Sharmila: షర్మిల పాలేరులో గెలుస్తుందా? ప్రత్యర్థులెవరు? సేఫ్ నియోజకవర్గమేనా?
ఆరో రోజు మరింత ఉధృతం..
ఐదు రోజుల నిరసనపై ప్రభుత్వం కంటితుడుపు చర్యలే చేపట్టడందతో విద్యార్థులు నిరసనత ఉధృతి పెంచాలని నిర్ణయించారు. 4 వేల మందితో 48 గంటల జాగరణ దీక్ష ఆదివారం చేపట్టారు. దీంతో అలర్ట్ అయిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ మరోమారు విద్యార్థులతో చర్చలు జరిపేందుకు అర్ధరాత్రి వర్సిటీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా యూనిఫాంలు, 2500 ల్యాప్‌టాప్‌లు, 24 గంటలపాటు లైబ్రరీ తెరిచి ఉంచే మూడు డిమాండ్లకు అంగీకరించారు. నిరసన దీక్ష విరమించాలని కోరారు. అయితే దీనిపై చర్చించిన విద్యార్థులు డిమాండ్లు నెరవేర్చేందుకు అంగీకరించినట్లు మాటల్లో చెప్పడం కాకుండా లిఖితపూర్వక హామీ కావాలని పట్టుపట్టారు. దీనికి అధికారులు ముందుకు రాకపోవడంతో నిరసన దీక్ష కొనసాగించాలని నిర్ణయించారు.
హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమావేశం…
విద్యార్థులు శాంతియుత నిరసన తీవ్రరూంప దాల్చుతుండడం, నిరసన దీక్షతో విద్యార్థులు అస్వస్థతకు గురైతే పరిస్థితులు చేయిదాటిపోయే అవకాశం ఉండడంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అప్రమత్తమయ్యారు. సమస్యల పరిష్కారానికి, పర్మినెంట్ వీసీ నియామకానికి ఉన్నతస్థాయి సమావేశం హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. 12 డిమాండ్లలో 5 ఇప్పటికే పరిష్కారానికి మొగ్గు చూపిన నేపథ్యంలో వీసీ నియామకానికి కమిటీ వేయాలని నిర్ణయించారు. మిగత సమస్యలపై కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. మరోవైపు విద్యార్థులు లిఖితపూర్వక హామీకి పట్టుపట్టడం మంత్రితోపాటు, అధికారులను ఇబ్బంది పెడుతోంది.
నిరసనలో ఆదర్శం..
శాంతియుత నిరసనలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఆరు రోజులైనా ఎలాంటి చిన్నపాటి సంఘటన కూడా జరుగకుండా, యూనివర్సిటీ విడిచి బయటకు వెళ్లకుండా ఐక్యంగా 8 వేల మంది విద్యార్థులు సాగిస్తున్న దీక్ష ప్రభుత్వాన్ని కదిలిస్తోంది. ఇటీవల ఆర్మీ అభ్యర్థులు సికింద్రబాద్ స్టేషన్‌లో విధ్వంసం సృష్టించి చాలామంది తమ భవిష్యతను అంధకారంలోకి నెట్టుకున్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మాత్రం శాంతిమార్గంలో చేస్తున్న ఆందోళనతో అధికారులు, ప్రభుత్వంలో చలనం తీసుకురావడం శుభపరిణామం.