Trying To Stabilize India-Russia Transactions: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో పరిస్థితులు మారిపోతున్నాయి. ఉక్రెయిన్ కు మద్దతుగా చాలా దేశాలు నిలుస్తున్నాయి. ఇదే సందర్భంలో రష్యాపై ఆంక్షలు విధిస్తున్నా లెక్కచేయడం లేదు. దీంతో చమురు వ్యాపారంపై కూడా నిబంధనలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యాను కంట్రోల్ చేయాలని అగ్రరాజ్యం అమెరికా భావిస్తోంది. కానీ దాని ఆదేశాలను మాత్రం కొన్ని దేశాలు పట్టించుకోవడం లేదు. అందులో భారత్ కూడా ఒకటి. చైనా కూడా అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తోంది. ప్రస్తుతం వ్యాపారాలు డాలర్ల రూపంలో జరగడంతో దానిపైనే ఆధారపడుతున్నాయి.

ప్రపంచంలోని చాలా దేశాలు అమెరికాపైనే ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా ఎప్పటి నుంచో డాలర్ వాడకాన్ని తగ్గించేస్తోంది. దీని కోసం చైనా కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా విధిస్తున్న ఆంక్షలను లెక్కచేయకుండా రష్యాతో చమురు కొనుగోలు చేస్తోంది. దీనికి చైనా యువాన్ల రూపంలో చెల్లింపులు చేస్తోంది. దీంతో డాలర్ ప్రామాణికాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రష్యాతో జరుగుతున్న వ్యాపారంలో చైనా యువాన్లను చెల్లిస్తుండటంతో డాలర్ మనుగడకు ప్రమాదం పొంచి ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి.
ఉక్రెయిన్ విషయంలో అమెరికా అన్ని దేశాలపై పెత్తనం చేయాలని చూస్తోంది. ఇందుకోసం అన్ని దేశాలు ఉక్రెయిన్ కు మద్దతు తెలపాలని రష్యా చర్యలను ఖండించాలని సూచిస్తోంది. కానీ అన్ని దేశాలు మాత్రం అగ్రరాజ్యం సూచనలు పాటించడం లేదు. తమ ఉనికికి ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉందని గ్రహించి తమ వ్యాపారాలు రష్యాతో కొనసాగించేందుకే నిర్ణయించాయి. రష్యాతో ఏప్రిల్ లో చైనా మరిన్ని కాంట్రాక్టులు కుదుర్చుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
అమెరికా ఆంక్షలను సౌదీ అరేబియా కూడా బేఖాతరు చేస్తోంది. యెమన్ తో సౌదీ చేస్తున్న యుద్ధానికి అమెరికా అడ్డు తగలడంతో రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ జమాల్ హత్యతో సౌదీపై బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అమెరికాతో స్నేహం చేయడానికి నిరాకరిస్తున్నాడు. దీంతో డాలర్ ను కరెన్సీగా ఒప్పుకోవడానికి నిరాకరిస్తున్నారు. 1974 నుంచి పెట్రో వ్యాపారానికి డాలర్ ను కరెన్సీగా చేయాలని అమెరికా-సౌదీ మధ్య ఒప్పందం కుదిరింది. పెట్రోలియం ఉత్పత్తుల్లో వచ్చిన ఆదాయాన్ని కరెన్సీ రూపంలోనే చేయడం తెలిసిందే.

చైనాతోపాటు సౌదీ అరేబియా, భారత్ కూడా డాలర్ కు ప్రత్యామ్నాయం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే భవిష్యత్ లో చేసే వ్యాపారం తమ దేశాల కరెన్సీతోనే చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే భారత్ కూడా రష్యాతో రూబుల్-రూపాయి రూపంలోనే కొనుగోళ్లు చేయాలని భావిస్తోంది. దీంతో అమెరికా డాలర్ ఉనికికి ప్రమాదం పొంచి ఉందా అనే సంశయాలు అందరిలో వస్తున్నాయి. అయితే భారత్ దిగుమతులు రెండు శాతం మాత్రమే ఉంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 58 శాతం డాలర్ల రూపంలోనే వ్యాపారం సాగుతోంది. 20 శాతంతో యూరో లు ఉన్నాయి. చైనా కరెన్సీ కూడా రెండు శాతంతోనే కొనసాగుతోంది. చైనా యువాన్ ను డాలర్ కు ప్రత్యామ్నాయంగా చేయాలని చూస్తున్నా కుదరడం లేదు. అంతర్జాతీయంగా 40 శాతం వ్యాపారాలు డాలర్ల రూపంలోనే సాగుతుండటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో డాలర్ కు ఏ ప్రమాదం జరగడం లేదనే తెలుస్తోంది.