Trump
Trump : అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 2న ప్రపంచంలోని అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధించాడు. దీంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లతోపాటు అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు అమెరికా(America)లో ట్రంప్ నిర్ణయాలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా మినహా ప్రపంచ దేశాలపై సుంకాల అమలును వాయిదా వేశారు.
Also Read : ట్రంప్ నిర్ణయం వారికి మరణశాసనం.. డబ్ల్యూఎఫ్‌పీ తీవ్ర విమర్శలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య విధానంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనా(China) నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఏకంగా 125% టారిఫ్‌ను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఏప్రిల్ 2న ఇతర 75 దేశాలపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం భారత్‌తో పాటు అనేక దేశాలకు ఊరటనిస్తుండగా, చైనాతో వాణిజ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది.
చైనా అవమానించిందని..
టారిఫ్‌ల ప్రకటన తర్వాత చైనా ప్రపంచ మార్కెట్లను అగౌరవపరిచిందన్న ఆరోపణ ఉంది. ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా, ‘చైనా ప్రపంచ మార్కెట్లను తీవ్రంగా అవమానించింది. అందుకే చైనా వస్తువులపై 125% సుంకం విధిస్తున్నాం. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది,‘ అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో భారత్(India), ఇతర దేశాలపై సుంకాల నిలిపివేత వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడానికి ఒక అడుగుగా భావిస్తున్నారు.
కుదుట పడనున్న ప్రపంచ మార్కెట్లు..
ట్రంప్ తాజా ప్రకటనతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో పెను మార్పులకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో ట్రంప్ సుంకాల ప్రకటనలతో మార్కెట్లు ఒడిదొడుకులకు లోనైనప్పటికీ, ఈ తాజా నిర్ణయం సానుకూల ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా, ఏప్రిల్ 10న స్టాక్ మార్కెట్లు గణనీయమైన జోష్‌ను చూడవచ్చని అంచనా.
అమెరికాపై చైనా కూడా..
మరోవైపు, చైనా కూడా అమెరికా వస్తువులపై 84% సుంకం విధిస్తూ దీటుగా స్పందించింది. ఈ పరస్పర సుంకాలతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైంది. చైనా తన పౌరులకు అమెరికా పర్యటనలపై హెచ్చరికలు జారీ చేస్తూ, విద్యార్థులు, పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ట్రంప్ నిర్ణయాలతో అమెరికా–చైనా మధ్య కోల్డ్ వార్ మరింత ఉధృతమైంది. అదే సమయంలో, భారత్ వంటి దేశాలకు తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ, ఈ సుంకాల విధానం దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా ఉంది.
Also Read : అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం.. భారీ జరిమానాలు, ఆస్తుల జప్తు..!
Web Title: Trump sensational decision on tariffs
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com