Donald Trump: “మూడో ప్రపంచ యుద్ధం తప్పదు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేస్తున్న తప్పులు మామూలువి కావు.. ఇలా అయితే ప్రపంచం అస్థిరతవైపు అడుగులు వేస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. యుద్ధం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు” అని ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన డోనాల్డ్ ట్రంప్.. మరోసారి వార్తల్లో వ్యక్తయ్యారు. అమెరికా అధ్యక్షుడి బరిలో ఉన్న ఆయన.. తాజాగా ప్రపంచంలోనే అత్యంత విలువైన పురస్కారానికి నాలుగో సారి నామినేట్ అయ్యారు. ఈ పని చేసింది కూడా రిపబ్లికన్ పార్టీ కావడం విశేషం. నమ్మినవారిని మోసం చేయటం, తనతో ఆ పని చేశాడని ఓ శృంగార తార ఆరోపించడం.. దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించడం.. పోలీసులు అరెస్టు చేయడం.. ఆ తర్వాత వదిలిపెట్టడం వంటి వివాదాలు ఎదుర్కొన్న డోనాల్డ్ ట్రంప్.. నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అవ్వడం విశేషం.
వాస్తవానికి నోబెల్ శాంతి బహుమతిని ప్రపంచ దేశాల మధ్య సౌబ్రాతృత్వం, శాంతి పెంపునకు విశేషంగా కృషి చేసిన వారికి ఇస్తారు. అయితే ఈ శాంతి బహుమతి కోసం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరును రిపబ్లికన్ పార్టీ నామినేట్ చేయడం విశేషం. రిపబ్లికన్ పార్టీ గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. అంతకుముందు రెండుసార్లు కూడా ఆయన ఈ పురస్కారానికి నామినేట్ అయ్యారు. అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకు ఈ పురస్కారం దక్కలేదు. పైగా ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొన్ని దేశాలపై అమెరికా యుద్ధం చేసిందనే అభియోగాలు ఉన్నాయి. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అబ్రహం అకార్డ్స్ ఒప్పందం తో పాటు ఇజ్రాయిల్, యూఏఈ మధ్య సంబంధాలు మెరుగుపరిచారని పేర్కొంటూ ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని రిపబ్లికన్ పార్టీ కోరింది. కాగా నోబెల్ బహుమతికి ట్రంప్ పేరు నామినేట్ చేయడం ఇది నాలుగవసారి.
నోబెల్ శాంతి బహుమతిని ఇప్పటివరకు వివిధ దేశాల మధ్య సౌబ్రాతృత్వానికి కృషి చేసిన వారికి మాత్రమే ఇచ్చారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మధ్య ఆసియా దేశాలపై నిరంకుశ వైఖరి అవలంబించారనే ఆరోపణలు ఉన్నాయి. ఉగ్రవాదాన్ని అణిచివేస్తున్నామని పేరుతో కర్కశంగా వ్యవహరించారు అనే విమర్శలు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ పేరును గతంలో మూడుసార్లు నోబెల్ శాంతి బహుమతి పురస్కారం కోసం నామినేట్ చేసినప్పటికీ కూడా పరిగణలోకి తీసుకోలేదు. మరి ఈసారైనా నోబెల్ శాంతి పురస్కార కమిటీ ట్రంప్ పేరు పరిశీలనలోకి తీసుకుంటుందా.. పురస్కారం ఇస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది.